america: ఒక ఆకుకు ఒక డాలర్... మాపుల్ ఆకులు కొంటున్న అమెరికన్ వెబ్‌సైట్!
- వారి డిజైనింగ్ బిజినెస్ కోసం మాపుల్ ఆకుల కొరత
- `క్యాష్4లీవ్స్` పేరిట వెబ్‌సైట్
- ఆకులు ఆరోగ్యంగా ఉండాలంటున్న కంపెనీ
అమెరికాలోని `షిప్ ఫాయిలేజ్` సంస్థ మాపుల్ ఆకులను ఉపయోగించి ఆభరణాలు, ఇతర డిజైనింగ్ వస్తువులను తయారు చేస్తుంది. అక్కడి న్యూ ఇంగ్లండ్ ప్రాంతం నుంచి వారు మాపుల్ ఆకులను సేకరిస్తుంటారు. అయితే ఇటీవల వారికి మాపుల్ ఆకులు సేకరించడం ఇబ్బందిగా మారింది. దీంతో న్యూ ఇంగ్లండ్ పరిధిలో నివాసం ఉన్నంటున్న వారిని మాపుల్ ఆకులు సేకరించి వారికి అమ్మాలని కోరారు. అందుకు గాను ఒక్క మాపుల్ ఆకుకు ఒక డాలర్ చెల్లిస్తామని పేర్కొన్నారు.
`క్యాష్4లీవ్స్` అనే వెబ్‌సైట్ పెట్టి... `చెట్లకు డబ్బులు కాయవని ఎవరు చెప్పారు... మీ ఇంటి మాపుల్ ఆకులు అమ్మండి... డబ్బు సంపాదించండి` అంటూ ఆకుల అమ్మకానికి సంబంధించిన ప్రచారం చేపట్టారు. అయితే ఆకులు ఆరోగ్యంగా ఉండాలని, తాము పెట్టబోయే పరీక్షలు అన్నింటిని తట్టుకున్న ఆకునే ఎంపిక చేసుకుంటామని షరతు విధించారు. ఇందుకోసం ముందుగా కొన్ని ఆకుల ఫొటోలను పంపించాలని ఈ-మెయిల్ ఐడీ కూడా ఇచ్చారు. ఒకవేళ ఆకులు తీసుకోవడానికి కంపెనీ అంగీకరిస్తే... ఒక్కో బాక్సులో 100 చొప్పున ఆకులను ప్యాక్ చేసి ఉంచితే, వారి ఏజెంట్ వచ్చి సేకరించుకుంటాడని తెలిపారు. ఆకు ఎలా ఉండాలో తెలుసుకోవడానికి కొన్ని ఫొటోలను కూడా వారు వెబ్‌సైట్‌లో ఉంచారు.