bahi dhooj: సోదరుడిని కాళ్లతో ఆశీర్వదిస్తున్న దివ్యాంగురాలైన సోదరి.... గుండెలు పిండేస్తున్న ఫొటో!
- భాయ్ దూజ్ పండగ సందర్భంగా సోదరుడికి ఆశీర్వాదం
- కాళ్లతోనే నుదుటన తిలకం
- మెచ్చుకుంటున్న నెటిజన్లు
టపాసుల మోతలు, ఇంటి నిండా వెలుగులతో నింపే దీపావళి పండగ పూర్తయ్యాక, ఆ మరుసటి రోజుని `భాయ్ దూజ్` పండగగా జరుపుకుంటారు. దక్షిణ భారతదేశంలో ఈ పండగ పెద్దగా ప్రాచుర్యంలో లేదు. కానీ ఉత్తర భారతంలో దీన్ని తప్పనిసరిగా జరుపుకుంటారు. ఇది రాఖీ పండగ లాంటిదే. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా ఈ పండగ జరుపుకుంటారు. తన సోదరుడు ఎల్లకాలం సుఖంగా, సంతోషంగా ఉండాలని అతడి నుదుటన తిలకం దిద్ది సోదరి ఆశీర్వదిస్తుంది. ఈ సందర్భంగా ఇద్దరూ ఒకరికొకరు బహుమతులు, కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు.
అలా కోల్‌కతాకు చెందిన సమ్రాట్ బసు కూడా తన సోదరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడు. అతడి నుదుటన ఆమె కాలి వేళ్లతో తిలకం దిద్ది, కాళ్లతోనే ఆశీర్వదించింది. కారణం... ఆమె రెండు చేతులు పనిచేయవు. దివ్యాంగురాలైన సోదరితో సమ్రాట్ ప్రతి ఏడాది భాయ్ దూజ్ పండగను ఇలాగే జరుపుకుంటాడు. పండగనాటి ఫొటోలను సమ్రాట్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఫొటోలు చూసిన వారంతా కన్నీటిపర్యంతమైనట్లు చెప్పుకొచ్చారు. వారి అనుబంధం కలకాలం ఉండాలని ఆశీర్వదించారు. ఒక పక్క సమ్రాట్‌ని మెచ్చుకుంటూనే, సోదరిని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు.