america: ఇరాన్ ను ఏకాకిని చేయాలంటూ గల్ఫ్ దేశాలకు పిలుపునిచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి
- ఇరాన్ ను దీటుగా ఎదుర్కోవాలని సౌదీ అరేబియా, ఇరాక్ లకు సూచన
- ఖతార్ తో ఉన్న సమస్యలు పరిష్కరించుకోవాలని సూచన
- మధ్యప్రాచ్యంలో ఇరాన్ తీరు వివాదాస్పదమన్న అమెరికా విదేశాంగ మంత్రి
ఇరాన్ ను ఒంటరిని చేయాలని మధ్యప్రాచ్యదేశాలకు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి రెక్స్ టిల్లర్ సన్ పిలుపునిచ్చారు. ఉత్తరకొరియా, ఇరాన్ దేశాలపై గత కొంత కాలంగా అమెరికా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్ ను ఎదుర్కొనేందుకు దీటుగా తయారవ్వాలని సౌదీ అరేబియా, ఇరాక్ దేశాలకు ఆయన పిలుపునిచ్చారు.
ఖతార్ తో ఉన్న సమస్యలు పరిష్కరించుకోవాలని ఆయన ఇరుగుపొరుగు దేశాలకు సూచించారు. మధ్య ప్రాచ్యంలో ఇరాన్ అనుసరిస్తున్న వైఖరిని ఆయన తూర్పారబట్టారు. యూరోపియన్ దేశాలు ఇరాన్ కు చెందిన రెవల్యూషనరీ గార్డ్ కోర్ తో సంబంధాలు పెట్టుకోవద్దని ఆయన సూచించారు. ఇరాన్ మద్దతు గల షితే మిలీషియా తిరుగుబాటుదారులను ఆ దేశం నుంచి రప్పించి, ఇరాక్ సైన్యంలో విలీనం చేయాలని ఆయన సలహా ఇచ్చారు.