mumbai: ముంబైలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిల పనుల కోసం రూ. 2 కోట్ల ఎంపీ నిధిని అందజేసిన సచిన్
- ఎల్ఫిన్‌స్టోన్ తొక్కిసలాట ఘటనకు చలించిన మాస్టర్ బ్లాస్టర్
- రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌కి లేఖ రాసిన సచిన్
- పశ్చిమ, మధ్య రైల్వేలకు చెరో కోటి రూపాయల చొప్పున జారీ
సెప్టెంబర్‌లో ముంబైలో జరిగిన ఎల్ఫిన్‌స్టోన్ రైల్వే స్టేషన్ ఫుట్ఓవర్ బ్రిడ్జి తొక్కిసలాట ఘటన రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్‌ని తీవ్రంగా కలచివేసింది. దీంతో ఫుట్ ఓవర్ బ్రిడ్జిల అభివృద్ధి పనుల కోసం రూ. 2 కోట్లు తన ఎంపీ నిధి నుంచి జారీ చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ముంబై సబర్బన్ జిల్లా కలెక్టర్‌కి వినతి పెట్టుకున్నట్లు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కి రాసిన లేఖలో సచిన్ పేర్కొన్నారు.
ముంబైలోని పశ్చిమ రైల్వేకి రూ. కోటి, మధ్య రైల్వేకు రూ. కోటి జారీ చేసినట్లు ఆయన తెలియజేశారు. `ఇటీవల జరిగిన ఎల్ఫిన్‌స్టోన్ ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. సాటి ముంబై వాసులకు నా వంతు సహాయంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను అభివృద్ధి చేయాలనుకుంటున్నా` అని సచిన్ లేఖలో తెలిపారు. ప్రతి ఏడాది తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి కోసం ఖర్చు చేయడానికి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్‌మెంట్ (ఎంపీల్యాడ్స్) కింద రూ. 5 కోట్ల మొత్తాన్ని కేంద్రం జారీ చేస్తుంది.