mersel movie: అంటే రాజకీయ నాయకులంతా అవినీతిపరులా?: బీజేపీ నేత జీవీఎల్ పై మంచు విష్ణు ఆగ్రహం
- రాజకీయ నాయకులంతా అవినీతి పరులా?
- గొప్పగొప్ప నటులే గొప్ప రాజకీయ వేత్తలయ్యారు
- జీకే తెలిసి ఉండాల్సిన అవసరం లేదు
టాలీవుడ్ నటుడు మంచు విష్ణు బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ఒక టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జీవీఎల్ 'మెర్సెల్' సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, 'భారత సినీ నటుల్లో ఎక్కువ మందికి బుర్ర లేదు. వారికి జనరల్ నాలెడ్జ్ కూడా తక్కువే' అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
దీనిపై ఫర్హాన్ అఖ్తర్ మండిపడ్డ సంగతి కూడా తెలిసిందే. తాజాగా మంచు విష్ణు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సినిమా స్టార్లకు జీకే ఉండదు అనుకుంటే.. మరి రాజకీయ నాయకులంతా అవినీతి పరులు, దోపిడీదారులా? అని ప్రశ్నించారు. మన దేశానికి చెందిన గొప్ప నటులే గొప్ప రాజకీయవేత్తలు అయ్యారన్న విషయం మరువద్దని ఆయన హితవు పలికారు.
అలాంటివారిలో నందమూరి తారక రామారావు, ఎంజీఆర్, జయలలిత ఉన్నారని ఆయన గుర్తు చేశారు. ఒకరి అభిప్రాయం చెప్పడానికి జీకే ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసిన విష్ణు, తాను భారతీయుడినని, క్రైస్తవ యువతిని వివాహం చేసుకున్నప్పటికీ హిందుత్వాన్ని నమ్ముతానని తెలిపాడు.
చివరిగా తాను హిందువునని చెప్పుకోవడానికి గర్వపడతానని స్పష్టం చేశాడు. అదే సమయంలో బీజేపీపై తనకు గౌరవముందని, మోదీ అంటే అభిమానమని తెలిపాడు. కాగా, ఈ సినిమాలో జీఎస్టీపై పలు ప్రశ్నలు సంధించిన సంగతి తెలిసిందే.