gst: అభివృద్ధి వ్యతిరేక రాష్ట్రాలకు ఒక్క పైసా కూడా ఇచ్చేది లేదు: ప్రధాని మోదీ
- ప్రజల సొమ్ము అభివృద్ధికి మాత్రమే
- గుజరాత్ అభివృద్ధికి పాటు పడుతున్నట్లు వ్యాఖ్య
- పాలన సజావుగానే సాగుతోందంటూ ప్రతిపక్షానికి చురక
దేశంలో రాష్ట్రాల అభివృద్ధి, ఆర్థిక ప్రగతి గురించి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. గుజరాత్‌లో రో-రో ఫెర్రి (రోల్ ఆఫ్ రోల్ ఆఫ్ ఫెర్రి) ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన ఈ సందర్భంగా ప్రసంగించారు. అభివృద్ధికి అడ్డుపడుతూ, వ్యతిరేకంగా ఉన్న రాష్ట్రాలకు ఒక్క పైసా కూడా కేంద్రం నుంచి ఇచ్చేది లేదని ఆయన వెల్లడించారు.
`ప్రజల సొమ్మును కేవలం అభివృద్ధికి మాత్రమే ఖర్చు చేయాలని మా ప్రభుత్వం గట్టిగా నమ్ముతోంది. అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చే రాష్ట్రాలకు అన్ని రకాలుగా సహాయం చేస్తాం. అదేవిధంగా అభివృద్ధి వ్యతిరేక రాష్ట్రాలకు ఎలాంటి సాయం చేయం` అని మోదీ స్పష్టం చేశారు.
ఇటీవల గుజరాత్‌లో పర్యటించి, మోదీ పాలన మీద రాహుల్ గాంధీ కురిపించిన విమర్శలకు కూడా మోదీ ఈ సందర్భంగా సమాధానమిచ్చారు. `నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు అభివృద్ధి కోసమే పాటుపడ్డాను. ఇప్పుడు కూడా అదే చేస్తున్నాను` అన్నారు.
అలాగే జీఎస్టీ, నోట్లరద్దు గురించి కూడా రాహుల్ చేసిన విమర్శలకు మోదీ పరోక్షంగా సమాధానమిచ్చారు. తమ ఆర్థిక సంస్కరణలను నిపుణులు మెచ్చుకున్నారని, ఇప్పటివరకు పాలన సజావుగా జరుగుతోందని, సంస్కరణల కారణంగా ఎలాంటి అనిశ్చితి రాలేదని మోదీ పేర్కొన్నారు.