shareen mathews: ఎన్నారై బాలిక షరీన్ అదృశ్యం విషాదాంతం... గుర్తు పట్టలేని మృతదేహం మాత్రమే లభ్యం!
- డ్రైనేజి టన్నెల్ లో షరీన్ మృతదేహం
- వైద్య పరీక్షల అనంతరం అధికారికంగా ప్రకటిస్తామన్న పోలీసులు
- మ్యాథ్యూస్ ఇంటికి అర మైలు దూరంలో ప్రాణాలు కోల్పోయిన షరీన్
- పాలు తాగలేదని శిక్షించిన తండ్రి, ఆపై కనిపించని షరీన్
గత నెల 7వ తేదీన పాలు తాగడం లేదని ఆరోపిస్తూ, బయట నిలబడాలని తండ్రి శిక్షను విధించగా, బయటకు వెళ్లి మాయమైన ఎన్నారై బాలిక షరీన్ మ్యాథ్యూస్, విగతజీవిగా హ్యూస్టన్ పోలీసుల కళ్లబడింది. మూడేళ్ల బాలిక మృతదేహం ఒకటి గుర్తు పట్టలేని స్థితిలో ఓ డ్రైనేజి టన్నెల్ లో కనిపించిందని రిచర్డ్ సన్ పోలీసు విభాగం ప్రకటించింది. ఈ బాలికను ప్రస్తుతానికి గుర్తు పట్టక పోయినా, మరో అదృశ్యం కేసు నమోదు కాకపోవడంతో ఈమే షరీన్ అని భావిస్తున్నామని అధికారులు తెలిపారు.
వైద్య పరీక్షల అనంతరం బాలిక ఆచూకీని అధికారికంగా తెలియజేస్తామని అన్నారు. మ్యాథ్యూస్ ఇంటి నుంచి సుమారు అర మైలు దూరంలో ఈ మృతదేహం లభించింది. బాలిక ఆచూకీ కోసం దాదాపు రెండు వారాల పాటు వెతికిన తరువాత, డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దించగా, అవి ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో మృతదేహాన్ని గుర్తించాయి. చిన్నారి మరణానికి కారణం ఏంటన్నది ఇంకా తెలియరాలేదని, పోస్టుమార్టం అనంతరం అసలు కారణం తెలుస్తుందని అధికారులు తెలిపారు. ఈ కేసులో షరీన్ మారు తండ్రి వెస్లీ మ్యాథ్యూస్ ను అరెస్ట్ చేసిన పోలీసులు, ఆ మరుసటి రోజు 2.5 లక్షల డాలర్ల బాండ్ పై అతనికి బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.