sachin: బాగా తినాలని వెళ్తే... రెండేసి స్పూన్లే మిగిల్చారు: చిన్ననాటి అనుభవాన్ని పంచుకున్న సచిన్ టెండూల్కర్
- 9 ఏళ్ల వయసు నాటి అనుభవాన్ని వెల్లడించిన సచిన్
- చైనీస్ ఫుడ్ తినేందుకు స్నేహితులతో కలిసి వెళ్లిన సచిన్
- టేబుల్ చివర్న కూర్చోబెట్టి మొత్తం తినేశారని బాధ
బాల్యంలో ఇష్టమైన ఆహారం లభిస్తే ఎక్కువ తినాలని అనుకుంటాం. ‘క్రికెట్ దేవుడు’గా నీరాజనాలు అందుకున్న సచిన్ టెండూల్కర్ ఈ భావనకి అతీతుడుకాడు. ఈ మేరకు తన బాల్యంలో చోటుచేసుకున్న ఆసక్తికర సంఘటన గురించి సచిన్ ఆటోబయోగ్రఫీని 'ప్లేయింగ్ ఇట్ మై వే' పేరిట పుస్తకాన్ని తీసుకొచ్చిన 'హచ్చాటే' సంస్థ తాజాగా సచిన్ బాల్యంలోని సంగతులతో 'ఛేంజ్ యువర్ డ్రీమ్స్' పేరిట పుస్తకాన్ని తీసుకొచ్చింది. అందులో తన 9 ఏళ్ల వయసులో ఎంతో ఇష్టంగా రుచి చూడాలని భావించిన చైనీస్ ఫుడ్ అనుభవం డిజాస్టర్ గా మారిందని తెలిపాడు.
దాని వివరాల్లోకి వెళ్తే... ముంబైలో 1980లలో చైనీస్ ఫుడ్ కు అప్పుడప్పుడే ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలో స్నేహితుల కారణంగా ఈ చైనీస్ ఫుడ్ గురించి సచిన్ కు తెలిసింది. దీంతో వారంతా కలిసి దానిని రుచి చూడాలని భావించారు. ఇందుకోసం తలాపది రూపాయలు కూడబెట్టుకున్నారు.
పది రూపాయలంటే అప్పట్లో చాలా ఎక్కువ. డబ్బులు సమకూరిన తరువాత అంతా ఉత్సాహంగా రెస్టారెంట్ కు బయల్దేరారు. చైనీస్ ఫుడ్ తింటున్నామన్న ఆనందంతో పెద్ద టేబుల్ దగ్గర కూర్చున్నారు. అందర్లోకి చిన్నవాడు కావడంతో సచిన్ ను టేబుల్ చివరన కూర్చోబెట్టారు. తొలుత చికెన్, స్వీట్ కార్న్ సూప్ ను ఆర్డర్ చేశారు. తరువాత ఫ్రైడ్ రైస్, నూడుల్స్ ఇలా అన్నీ పెద్ద బౌల్ నిండా వచ్చాయి. అయితే అందరూ పెద్ద వాళ్లు కావడానికి తోడు, టేబుల్ చివరన సచిన్ ఉండడంతో సచిన్ వరకు వచ్చేసరికి బౌల్స్ ఖాళీ అయిపోయేవి. ఒకట్రెండు స్పూన్లు మాత్రమే మిగిలేవి. దీంతో సచిన్ ఆకలితోనే ఇంటికెళ్లాడు. ఆ సమయంలో, తమ డబ్బులతో పెద్దవాళ్లంతా కలసి తమకు లేకుండా లాగించేశారనిపించిందని అందులో వివరించాడు. చైనీస్ ఫుడ్ చేదు అనుభవం మిగిల్చిందని, తనకు తన తల్లి చేసే చేపలు, రొయ్యల కూర తనకు ఇష్టమని అన్నాడు. తనకోసం తన తల్లి ప్రత్యేకంగా వాటిని తయారు చేసేదని తెలిపాడు.