PACS: ఫిరాయింపునకు కోటి రూపాయలు మాట్లాడారు, రూ. 10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు: బీజేపీపై పటీదార్ నేత సంచలన ఆరోపణ
- డబ్బులు తెచ్చి మీడియాకు చూపిన వరుణ్ పటేల్
- కాంగ్రెస్ తో కుమ్మక్కై ఆరోపణలు చేస్తున్నారు
- డబ్బు బీజేపీదేనని చెప్పడానికి ఆధారాలు ఏంటి?
- ప్రశ్నించిన బీజేపీ నేతలు
బీజేపీలో చేరితే కోటి రూపాయలు ఇస్తామని చెబుతూ తనకు రూ. 10 లక్షలు ఇచ్చారని పీఏఏఎస్ (పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి) కన్వీనర్ నరేంద్ర పటేల్ సంచలన ఆరోపణలు చేశారు. పటీదార్ సంఘం నేత హార్దిక్ పటేల్ కు దగ్గరి అనుచరుడైన వరుణ్ పటేల్ శనివారం నాడు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆపై 24 గంటలు గడవకుండానే, మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన మరో పటేల్ వర్గం నేత నరేంద్ర పటేల్, బీజేపీపై నిప్పులు చెరుగుతూ విమర్శలు చేశారు.
తనకు రూ. కోటి ఇచ్చేందుకు బీజేపీ నేతలు బేరం కుదుర్చుకున్నారని, రూ. 10 లక్షలు ఇచ్చారని, ఆ డబ్బులు ఇవేనని చెబుతూ డబ్బులు చూపారు. రిజర్వ్ బ్యాంకు మొత్తాన్ని తన పేరిట రాసినా పటీదార్ అనామత్ ఆందోళన్ సమితికి అన్యాయం చేయబోనని తేల్చి చెప్పారు. కాగా, నరేంద్ర పటేల్ ఆరోపణలను వరుణ్ ఖండించారు. కాంగ్రెస్ తో కుమ్మక్కై ఈ ఆరోపణలు చేస్తున్నారని, డబ్బు బీజేపీదేనని చెప్పేందుకు ఆధారాలు ఉన్నాయా? అని అడిగారు. కాగా, నరేంద్ర ఆరోపణలపై బీజేపీ అధికారికంగా ఇంకా స్పందించలేదు.