president: రాష్ట్రపతి భద్రత కోసం నాలుగేళ్లలో రూ. 155 కోట్లు ఖర్చు!
- అత్యధికంగా 2016-17లో ఖర్చు
- వాహనాల నిర్వహణ కోసం రూ. 64.9 లక్షలు
- ఆర్టీఐ కింద అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన రాష్ట్రపతి భవన్
రాష్ట్రపతి భద్రత కోసం పెడుతున్న ఖర్చు వివరాలను తెలుసుకోవడానికి లక్నోకి చెందిన సామాజిక కార్యకర్త న్యూటన్ ఠాకూర్ సమాచార హక్కు చట్టాన్ని ఆశ్రయించారు. దీనికి రాష్ట్రపతి భవన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సమాధానమిచ్చారు. 2014 - 17 మధ్య ఇప్పటివరకు రాష్ట్రపతి భద్రత కోసం రూ. 155.4 కోట్లు చెల్లించినట్లు పేర్కొన్నారు. 2014-15లో రూ. 38.17 కోట్లు, 2015-16లో రూ.41.77 కోట్లు, 2016-17లో రూ.48.35 కోట్లు, 2017-18లో ఇప్పటి వరకు రూ.27.11కోట్లు రాష్ట్రపతి భద్రతా సిబ్బందికి జీతాలుగా చెల్లించినట్లు వెల్లడించారు.
అంతేకాకుండా ఈ నాలుగేళ్లలో భద్రతా సిబ్బంది ఉపయోగించే వాహనాల నిర్వహణ కోసం రూ.64.9 లక్షలు ఖర్చు పెట్టారు. ఇందులో 2014-15లో రూ.15.5 లక్షలు, 2015-16లో రూ.20 లక్షలు, 2016-17లో రూ.21.8 లక్షలు, 2017-18లో ఇప్పటి వరకు రూ.7.5 లక్షలు చెల్లించినట్లు తెలిపారు. ఈ వ్యయంలో ఇంధన ఖర్చును మినహాయించారు. అందుకు కారణం... ప్రభుత్వ పెట్రోల్ బంకుల నుంచే ఇంధనాన్ని ఉపయోగించామని పేర్కొన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా భద్రతా సిబ్బంది ఎంత మంది ఉంటారు? ఎన్ని వాహనాలు ఉపయోగిస్తారు? అనే విషయాలను రాష్ట్రపతి భవన్ వెల్లడించలేదు.