Hyderabad: ఇంజనీరింగ్ విద్యార్థుల ప్రాణాలపైకి తెచ్చిన వాట్స్ యాప్ మెసేజ్!
- ఇద్దర్ని ఆసుపత్రి పాలు చేసిన వాట్స్ యాప్ మెసేజ్
- మైసమ్మగూడలోని నర్సింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల మధ్య ఘర్షణ
- ఇద్దరు విద్యార్థులపై కత్తులతో దాడి చేసిన సహవిద్యార్థి
వాట్స్ యాప్ మెసేజ్ ఒక ఇంజనీరింగ్ విద్యార్థి ప్రాణం మీదికి తెచ్చింది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... హైదరాబాదు శివారు మైసమ్మగూడలోని నర్సింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో రోహిత్ (20), భువనేశ్వర్ (20), వైభవ్ (20) లు బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నారు. ఒకే తరగతి కావడంతో కళాశాలలోని ఇతర స్నేహితులతో కలిసి వాట్స్ యాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవల రోహిత్, భువనేశ్వర్ ల మధ్య చిన్నపాటి వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో దీపావళి రోజు రాత్రి ‘రేపు (శుక్రవారం) రోహిత్ ను నేను కొట్టబోతున్నాను’ అంటూ భువనేశ్వర్ వాట్స్ యాప్ గ్రూపులో మెసేజ్ పెట్టాడు. దీనిని చదివిన రోహిత్ నిన్న ఉదయం తన స్నేహితులతో కలిసి కాలేజీకి వెళ్లాడు. అప్పుడే బస్సులో కళాశాలకు వచ్చిన భువనేశ్వర్ పై కత్తితో దాడి చేశాడు.
స్నేహితులు భువనేశ్వర్ చేతులు పట్టుకోగా రోహిత్ దాడికి దిగాడు. దీంతో భువనేశ్వర్ ముఖం, చేతులు, నడుముకు గాయాలయ్యాయి. దీనిని చూసిన వీరి మిత్రుడు వైభవ్ ఆ దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో అతనికి కూడా గాయాలయ్యాయి. దీంతో హుటాహుటీన బాధితులను ఆసుపత్రికి తరలించారు.
దీనిపై సమాచారం అందడంతో హైదరాబాదు శివారు పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. రోహిత్ పరారీలో ఉండడంతో అతని కోసం గాలింపు చేపట్టారు. దీనిపై క్షతగాత్రుడు భువనేశ్వర్ తల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల విద్యార్థి కత్తులతో కళాశాలలో ప్రవేశించడమేంటని ప్రశ్నించారు. చదువుకోసం కళాశాలకు వెళ్తున్నారా? లేక గూండాలుగా మారేందుకు వెళ్తున్నారా? అని ఆమె ప్రశ్నించారు. కాగా, భువనేశ్వర్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.