kim jong un: అమెరికా అణుయుద్ధం కోరుతోంది... అడ్డుకుందాం రండి: ఆస్ట్రేలియాకు స్వయంగా లేఖ రాసిన కిమ్ జాంగ్
- ఆస్ట్రేలియాకు చేరిన కిమ్ లేఖ
- స్వయంగా సంతకం చేసిన కిమ్
- ట్రంప్ తో ఉత్తర కొరియాకు ముప్పు
- మరిన్ని దేశాలకు లేఖలు రాసే అవకాశం
అమెరికాకు వ్యతిరేకంగా వివిధ దేశాల మద్దతును కూడగట్టాలని భావిస్తున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్, ఆశ్చర్యాన్ని కలిగిస్తూ, ఆస్ట్రేలియా సహకారాన్ని కోరాడు. ఆస్ట్రేలియా ప్రభుత్వానికి కిమ్ రాసిన ఓ లేఖ ఇప్పుడు కలకలం రేపుతోంది. సెప్టెంబర్ 28వ తేదీన రాసినట్టుగా ఉన్న ఈ లేఖ, జకార్తాలోని ఉత్తర కొరియా ఎంబసీ ద్వారా ఆస్ట్రేలియాకు చేరింది. దీనిపై కిమ్ స్వయంగా సంతకం పెట్టారు కూడా.
ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎంపికైన నాటి నుంచి తమకు ముప్పు పెరిగిందని, అణుయుద్ధాన్ని కోరుకుంటున్న అమెరికాను అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని కిమ్ తెలిపారు. ఈ విషయంలో అంతర్జాతీయ న్యాయం జరగాలని, తమపై ఉన్న ఆంక్షలను తొలగించేందుకు ఆస్ట్రేలియా సహకరించాలని ఆయన కోరారు. కిమ్ రాసిన లేఖ తమకు చేరినట్టు ఆస్ట్రేలియా విదేశాంగ శాఖామంత్రి జూలీ బిషప్ తెలిపారు.
తాము ఒంటరిగా మిగిలిపోతున్నామన్న ఆందోళన ఈ లేఖలో కనిపిస్తోందని ఆస్ట్రేలియా వార్తా సంస్థ 'ఫెయిర్ ఫాక్స్' ప్రకటించింది. ఇక ఐక్యరాజ్యసమితి నుంచి ఆంక్షలను ఎదుర్కొంటున్న అన్ని దేశాల ప్రభుత్వాలకు కూడా కిమ్ లేఖలను రాయనున్నారని తెలుస్తోంది.