revant: తనను వ్యతిరేకించే డీకే ఆరుణతో రేవంత్ చర్చలు!
- మహబూబ్ నగర్ జిల్లాలో ఇంతకాలం విమర్శలు ప్రతి విమర్శలు
- ఇప్పుడు కాంగ్రెస్ లో రేవంత్ చేరితే ఇద్దరూ ఒకే పార్టీలో
- రేవంత్ చేరికను వ్యతిరేకిస్తున్న డీకే అరుణ
- సర్దిచెప్పేందుకు ప్రయత్నిస్తున్న రేవంత్
మొదటి నుంచి రాజకీయంగా తనను వ్యతిరేకిస్తుండే మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన నేత డీకే అరుణతో రేవంత్ రెడ్డి చర్చించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్న రేవంత్ రెడ్డి, తనను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ నేతలతో విడివిడిగా సమావేశమై మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరులను కలిసి మాట్లాడిన ఆయన, ఆపై డీకే అరుణతో భేటీ అయినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. నిన్నటి వరకూ వేర్వేరు పార్టీల్లో ఉండి నిత్యమూ విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్న వీరు, రేవంత్, కాంగ్రెస్ పార్టీలో చేరితో ఒకే గొడుగు కింద ఉండాల్సిన పరిస్థితి రానుంది.
రేవంత్ వస్తే, ఆయనకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వవద్దని, ఎటువంటి షరతులు లేకుండా వస్తే మాత్రమే ఆహ్వానించాలని పలువురు కాంగ్రెస్ నేతలు అధిష్ఠానం వద్ద వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. రేవంత్ తో పాటు భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు కాంగ్రెస్ లోకి వచ్చే అవకాశాలు ఉండటంతో ఆయనకు మంచి స్థానాన్ని కల్పించవచ్చని కాంగ్రెస్ పార్టీకి చెందిన మరికొందరు చెబుతున్నారు. ఇక తన రాకతో ఎవరికీ ఇబ్బందులు ఉండవని, అందరమూ కలసి ముందుకు సాగుదామని, తనను వ్యతిరేకించే నేతలకు రేవంత్ చెబుతున్నట్టు తెలుస్తోంది.