tTelugudesam: రేవంత్ తో పాటు 16 జిల్లాల టీడీపీ అధ్యక్షులు కూడా కాంగ్రెస్ లోకి?... అత్యవసర సమావేశానికి అధిష్ఠానం ఆదేశం!
- ఈ ఉదయం సమావేశం కానున్న టీటీడీపీ
- కేంద్ర కమిటీతో కలసి పరిస్థితిపై చర్చ
- రేవంత్ తో పాటు 16 జిల్లాల టీడీపీ అధ్యక్షులు కూడా
- అదే జరిగితే తెలంగాణలో టీడీపీ దాదాపు ఖాళీ!
తెలంగాణ తెలుగుదేశం ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని వస్తున్న వార్తలు ఇప్పటికే కలకలం రేపగా, ఆయనతో పాటు పార్టీ మారేవారు ఎవరన్న విషయమై చర్చ జరుగుతోంది. కనీసం 16 జిల్లాల టీడీపీ అధ్యక్షులతో పాటు, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన నేతలు కూడా కాంగ్రెస్ లో చేరనున్నారని తెలుస్తుండగా, తక్షణం టీటీడీపీ పాలిట్ బ్యూరో, సెంట్రల్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించాలని తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం ఆదేశించినట్టు సమాచారం. దీంతో ఈ ఉదయం తెలంగాణలో టీడీపీ పాలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యులు సమావేశం కానున్నారు. కరీంనగర్, సిద్దిపేట, సంగారెడ్డి, ఖమ్మం, నల్లగొండ, వికారాబాద్, మేడ్చల్, భూపాలపల్లి, సూర్యాపేట జిల్లాల నుంచి ఫిరాయింపులు అధికంగా ఉండవచ్చని తెలుస్తోంది.
కాగా, ఈ వారం ప్రారంభంలో రేవంత్ రెడ్డి రెండు రోజుల పాటు న్యూఢిల్లీలో ఉండి, కాంగ్రెస్ లో చేరికపై మంతనాలు సాగించినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, తాను పార్టీ మారనున్నట్టు వచ్చిన వార్తలను ఆయన ఖండించినప్పటికీ, ఏపీ టీడీపీ నేతలను ప్రత్యక్షంగా విమర్శించడం, కేసీఆర్ నుంచి యనమల రామకృష్ణుడు వంటి మంత్రులు కోట్ల విలువైన కాంట్రాక్టులను పొందారని సంచలన ఆరోపణలు చేయడం ద్వారా, మానసికంగా తాను కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్న సంకేతాలను వెలిబుచ్చారు. ఇక అనధికార వర్గాలు ఊహిస్తున్నట్టుగా రేవంత్ తో పాటు 16 జిల్లాల్లోని పార్టీ నేతలు కాంగ్రెస్ లోకి ఫిరాయిస్తే, తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ దాదాపుగా ఖాళీ అయినట్టే!