Karunanidhi: ఏడాది తర్వాత బయటకొచ్చిన కరుణానిధి.. మురసోలి ఆఫీస్ సందర్శన!
- అరగంటపాటు ఎగ్జిబిషన్ సందర్శన
- వెంట కుమారుడు స్టాలిన్, కుమార్తె సెల్వి, ఇతర నేతలు
- ఎగ్జిబిషన్ హాల్‌లో కలియదిరిగిన వృద్ధ నేత
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎం.కరుణానిధి దాదాపు ఏడాది తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చారు. గురువారం సాయంత్రం ఆయన తన మొదటి బిడ్డగా భావించే మురసోలి కార్యాలయాన్ని సందర్శించారు. కుమారుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, కుమార్తె సెల్వి, ఇతర సీనియర్ నేతలు వెంటరాగా కరుణానిధి గోపాలపురంలోని ఇంటి నుంచి బయటకు వచ్చి కొడంబాక్కంలోని కార్యాలయానికి చేరుకున్నారు.
దినపత్రిక 75వ వార్షికోత్సవం సందర్భంగా ఆగస్టు 10న కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. ఎగ్జిబిషన్ రెండు వారాల క్రితమే ముగిసినప్పటికీ కరుణానిధి కోసం ఎగ్జిబిట్స్‌ను అలాగే ఉంచారు.
కరుణానిధి గురువారం సాయంత్రం 7 గంటలకు కార్యాలయాన్ని సందర్శించినట్టు మురసోలి ఉద్యోగి ఒకరు తెలిపారు. అరగంట పాటు ఉన్న ఆయన పాత ప్రెస్ పరికరాలు, గతంలో ఆయన రాసిన ఆర్టికల్స్, అత్యయిక స్థితి సమయంలో ఇతరులు రాసిన వ్యాసాలను కూడా చూశారు. ఆయన మైనపు విగ్రహం, ఆయన ప్రసంగాల ఆడియో విజువల్ షోను వీక్షించారు. అనంతరం తిరిగి ఇంటికి చేరుకున్నారు.