Rex Tillerson: భారత్‌ను ప్రశంసించి.. చైనాను విమర్శించిన అమెరికా!
- భారత్ తో కొనసాగిస్తోన్న ఈ స్థాయి బంధాన్ని చైనాతో ఎన్నటికీ ఏర్పరచుకోం
- భారత్ పలు ఆర్థిక సంస్కరణలను విజయవంతంగా అమలు చేస్తోంది
- దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తోన్న చైనా తీరు బాగోలేదు
- అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్ కీలక వ్యాఖ్యలు
అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్ వచ్చే వారం భారత్‌కు రానున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... భారత్‌పై ప్రశంసలు కురిపిస్తూ చైనాకు పరోక్షంగా హెచ్చరికలు చేశారు. భారత్, అమెరికా పరస్పర సహకారంతో ముందుకు వెళతాయని చెప్పారు. కొంత కాలంగా భారత్‌తో ప్రజాస్వామ్య బంధం బలపడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, భద్రత కోసం, అలాగే ఉగ్రవాదాన్ని అణచివేయడానికి భారత్‌తో కలిసి తమ దేశం పనిచేస్తుందని టిల్లర్సన్ చెప్పారు.
భారత్ పలు ఆర్థిక సంస్కరణలను విజయవంతంగా అమలు చేస్తోందని ప్రశంసించారు. కాగా, దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తోన్న చైనా తీరు బాగోలేదని ఆయన అన్నారు. అంతర్జాతీయ చట్టాలను చైనా సవాలు చేస్తోందని వ్యాఖ్యానించారు. భారత్ వంటి దేశాల సార్వభౌమాధికారాలకు నష్టం కలిగించే వైఖరితో చైనా వ్యవహరిస్తోందని, ఇలాంటి సమయంలో భారత్‌కు విశ్వసనీయమైన భాగస్వామిగా ఉంటామని తెలిపారు.
అమెరికాలోని వాషింగ్టన్లో మేధో సంస్థ ‘సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్’లో జరిగిన ఓ కార్యక్రమంలో టిల్లర్సన్ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ తో కొనసాగిస్తోన్న ఈ స్థాయి బంధాన్ని తాము చైనాతో ఎన్నటికీ ఏర్పరచుకోమని అన్నారు. ఎందుకంటే చైనా ప్రజాస్వామిక సమాజం కాదని ఆయన అన్నారు.