cyclone: ఉదయం నుంచి వైజాగ్ ను ముంచెత్తిన వాన
- బంగాళా ఖాతంలో వాయుగుండం
- ఉదయం నుంచి విశాఖ జిల్లాను ముంచెత్తిన వర్షం
- పూరీకి 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండం
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా విశాఖపట్టణం జిల్లాను వర్షాలు ముంచెత్తుతున్నాయి. నేటి ఉదయం వైజాగ్ ను పలకరించిన చిరుజల్లులు ఇంకా పడుతూనే వున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో మత్స్యకారులెవరూ సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
తుపాను నేపథ్యంలో తీరప్రాంతం వెంబడి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. పూరీకి 370 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. దీని కారణంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వారు చెప్పారు. తీర ప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో విశాఖ వాసుల దీపావళి శోభ హరించుకుపోయింది.