banaganapalli: బస్టాండు ముందు ధర్నాకు దిగిన టీడీపీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి
- కోవెలకుంట్ల బస్టాండు ఎదుట నిరసన
- మౌలిక వసతులు కల్పించడం లేదని ఆరోపణ
- మంత్రికి చెప్పినా ఫలితం లేదని ఆవేదన
తన మాటలను పట్టించుకోవడం లేదని, ఎంత చెప్పినా అధికారులు స్పందించడం లేదని ఆరోపిస్తూ బనగానపల్లె ఎమ్మెల్యే, తెలుగుదేశం నేత బీసీ జనార్దనరెడ్డి నిరసనకు దిగడం కలకలం రేపింది. కోవెలకుంట్ల ఆర్టీసీ బస్టాండులో ప్రయాణికులకు కనీస మౌలిక వసతులు కల్పించాలని గతంలో అప్పటి రవాణా మంత్రిగా ఉన్న శిద్ధా రాఘవరావును కోరినా ఫలితం లేకపోయిందని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు.
రెండేళ్లు గడిచినా సమస్య పరిష్కారం కాలేదని చెబుతూ బస్టాండు ఎదుట దీక్ష చేపట్టారు. బస్టాండుకు రక్షణ గోడ కావాలని, మురుగునీరు పోయేందుకు డ్రైనేజీ వేయాలని, ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్న సెస్ తో స్టేషన్ ను అభివృద్ధి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్పొరేషన్ అధికారుల తీరు సరిగ్గా లేదని, అందువల్లే అధికార పార్టీ ఎమ్మెల్యేను అయినా నిరసనకు దిగాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. రెండు రోజుల్లో సమస్యల పరిష్కారానికి స్పందించకుంటే మళ్లీ దీక్షకు దిగుతానని అన్నారు. కాగా, రెండు నెలల్లో సమస్యలన్నీ తొలగించేందుకు కృషి చేస్తామని ఈడీ రామారావు వెల్లడించారు.