Revanth reddy: రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ వైపు చూడడానికి మోత్కుపల్లి వ్యాఖ్యలే కారణమా?

  • టీఆర్ఎస్‌తో పొత్తు ఉంటుందని మోత్కుపల్లి ప్రకటన
  • ఆయన వ్యాఖ్యలతో రేవంత్‌రెడ్డిలో అసహనం
  • కాంగ్రెస్‌లో చేరికకు అదే కారణమంటున్న ఆయన వర్గీయులు

రేవంత్‌రెడ్డి అకస్మాత్తుగా కాంగ్రెస్ వైపు ఎందుకు చూశారు? టీడీపీకి వీర విధేయుడుగా ఉన్న ఆయన పక్క చూపులు చూడడానికి కారణం ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యలేనని అంటున్నారు. రాష్ట్ర టీడీపీలో తాజా పరిణామాలు కూడా ఆయన పార్టీ వీడడానికి మరో కారణమని చెబుతున్నారు. ప్రభుత్వ విధానాలపై పార్టీ పేరుతో రేవంత్‌రెడ్డి కొన్ని కార్యక్రమాలను ఏకపక్షంగా నిర్వహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అలాగే పార్టీ నేతలను కలుపుకుని వెళ్లడం లేదని కిందిస్థాయి నేతలు ఆరోపిస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుందని కొందరు నేతలు ప్రచారం చేస్తుండగా అటువంటిదేమీ లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు కుండబద్దలుగొట్టారు. ఆయన వ్యాఖ్యలు రేవంత్ వర్గీయుల అసంతృప్తికి కారణమైంది. తమ నేత కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుందని చెబితే మోత్కుపల్లి అందుకు విరుద్ధంగా ఏకంగా మీడియా ఎదుటే చెప్పడం, అవసరమైతే టీఆర్ఎస్‌తో పొత్తు ఉంటుందని చెప్పడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.

అవకాశం దొరికితే టీఆర్ఎస్‌ను, ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్న రేవంత్ రెడ్డి కూడా మోత్కుపల్లి వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. తాజా ఢిల్లీ పరిణామాలను చూస్తుంటే రేవంత్ చేరిక దాదాపు ఖాయమైనట్టేనని ఆయన వర్గీయులే చెబుతుండడం గమనార్హం. అయితే చేరిక ఢిల్లీలోనా, హైదరాబాద్‌లోనా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.

  • Loading...

More Telugu News