Hashim Amla: కోహ్లీ రికార్డులను మళ్లీ మళ్లీ బద్దలుగొట్టుకుంటూ పోతున్న ఆమ్లా
- తక్కువ ఇన్నింగ్స్‌లలో 26వ సెంచరీ పూర్తిచేసిన పరుగుల యంత్రం
- టీమిండియా సారథి కోహ్లీ రికార్డులు బద్దలు
- వరుసపెట్టి రికార్డులు సృష్టించుకుంటూ పోతున్న దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మన్
దక్షిణాఫ్రికా పరుగుల యంత్రం హషీమ్ ఆమ్లా టీమిండియా సారథి కోహ్లీ రికార్డులను బద్దలుగొట్టడమే పనిగా పెట్టుకున్నట్టున్నాడు. రెండు రోజుల క్రితం బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేలో 110 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన ఆమ్లా కెరీర్‌లో 26వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో అత్యంత వేగంగా 26వ సెంచరీ చేసిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరుపై ఉన్న రికార్డును చెరిపేశాడు. 26 సెంచరీలు చేసేందుకు కోహ్లీకి 166 ఇన్నింగ్స్‌లు అవసరం పడగా, ఆమ్లా 154వ ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత సాధించాడు.
అంతేకాదు.. వన్డేల్లో అత్యంత వేగంగా 7 వేల పరుగుల మైలురాయిని అందుకున్న కోహ్లీ రికార్డును కూడా ఆమ్లా ఇటీవల బద్దలుగొట్టాడు. కోహ్లీ 169వ ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించగా ఆమ్లా 150వ ఇన్నింగ్స్‌లోనే అతడి రికార్డును దాటేశాడు. 6 వేలు, 5 వేలు, 4 వేలు, 3 వేలు, 2 వేల వన్డే పరుగులను కూడా అత్యంత వేగంగా సాధించిన రికార్డు ఆమ్లాపైనే ఉండడం గమనార్హం.
కాగా, వన్డేల్లో కోహ్లీ 30 సెంచరీలు నమోదు చేసి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీపాంటింగ్‌తో సమానంగా ఉన్నాడు. అతడి కంటే ముందు ఒక్క సచిన్ మాత్రమే 49 సెంచరీలతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.