banglore: గోవధను అడ్టుకునేందుకు కానిస్టేబుళ్లతో వెళ్లి అవమానాన్ని ఎదుర్కొన్న యువతి!
- ఒక్కసారిగా దాడికి దిగిన స్థానికులు
- 100 మంది దాడి
- కారు ధ్వసం, దాడిలో విరిగిన నందిని చెయ్యి
- కేసు నమోదు
ఆవులను వధిస్తున్నారని తెలుసుకుని, విషయాన్ని పోలీసులకు చెప్పి, వారిని వెంటబెట్టుకుని మరీ ఓ ప్రదేశానికి వెళ్లిన యువతి, అక్కడ స్థానికులతో అవమానించబడ్డ ఘటన బెంగళూరులో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఓ మల్టీ నేషనల్ కంపెనీలో పని చేస్తున్న నందిని అనే యువ టెక్కీ, తలఘట్టపుర పరిధిలోని టిప్పు సర్కిల్ కసాయిఖానా వద్ద ఆవులను చంపుతున్నట్టు తెలుసుకుంది.
దీంతో ఇద్దరు కానిస్టేబుళ్లను తీసుకుని ఆ ప్రాంతానికి తన కారులో వెళ్లింది. ఆమె ఎందుకు వచ్చిందో తెలుసుకున్న స్థానికులు, దాదాపు 100 మంది ఒకేసారి దాడికి దిగారు. ఆమె చెయ్యి విరిచేశారు. కారును ధ్వంసం చేశారు. ఈ తతంగాన్ని చూసిన కానిస్టేబుళ్లు భయంతో బతుకుజీవుడా అనుకుంటూ పారిపోగా, ఒంటరిగా మిగిలిన యువతిపై అనుచితంగా ప్రవర్తించారు. చివరికి ప్రాణాలతో బయటపడ్డ ఆమె విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది. కేసును విచారిస్తున్నామని తలఘట్టపుర పోలీసులు వెల్లడించారు.