steve smith: ఆసీస్-ఇంగ్లండ్ ఆటగాళ్ల మధ్య తారస్థాయికి చేరుకుంటున్న మాటల యుద్ధం!
- బెన్‌స్టోక్స్‌పై ప్రశంసలు కురిపించి ఆపై తిట్ల వర్షం కురిపించిన ఆసీస్ కెప్టెన్
- గొప్ప ఆల్‌రౌంటర్ అంటూ కితాబు
- అతడిలాంటి వెధవ పనులు తమ జట్టులో ఎవరూ చేయరని వ్యాఖ్య
ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ దగ్గర పడుతున్న వేళ ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం క్రమంగా వేడెక్కుతోంది. ఇంగ్లిష్ ఆటగాళ్లను మానసికంగా దెబ్బతీసేందుకు ఆసీస్ ఆటగాళ్లు తమ నోళ్లకు అప్పుడే పదును పెట్టారు. ముఖ్యంగా బెన్‌స్టోక్స్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శల మీద విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల ఓ నైట్‌క్లబ్ బయట ఓ వ్యక్తిపై దాడిచేసిన కేసులో బెన్‌స్టోక్స్‌పై ఇంగ్లిష్ క్రికెట్ బోర్డు తాత్కాలికంగా వేటు వేసిన సంగతి తెలిసిందే.
స్టోక్స్ దాడికి సంబంధించిన వీడియోలు బయటపడడంతో అతడిపై కనీసం ఐదేళ్లు వేటుపడే అవకాశం ఉందని చెబుతున్నారు. కాగా, ఈ ఏడాది నవంబరు చివరి వారంలో ఆస్ట్రేలియాలో యాషెస్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బెన్‌స్టోక్స్‌పై ఆసీస్ కెప్టెన్ ఓవైపు పొగడ్తలు కురిపిస్తూనే మరోవైపు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. ప్రపంచంలోని అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో స్టోక్స్ ఒకడని పేర్కొన్న స్మిత్ అతడిలోని బ్యాటింగ్, బౌలింగ్ నైపుణ్యాలే ఈ స్థాయికి చేర్చాయని ప్రశంసించాడు.
అయితే, అదే నోటితో అతనిపై తిట్లు కూడా కురిపించాడు. అతడి ప్రవర్తన మాత్రం అంగీకార యోగ్యంగా లేదంటూ విమర్శించాడు. తమ జట్టులో అతడు చేసిన లాంటి వెధవ పనులు ఎవరూ చేయరంటూ తీవ్రస్థాయిలో తిట్టిపోశాడు. యాషెస్‌కు అతడు వస్తాడో, రాడో తెలియదని, అయితే బలమైన ప్రత్యర్థిపై ఆధిపత్యం కోసమే తాము ప్రయత్నిస్తామని పేర్కొన్నాడు.