reliance: రెండో విడతకు రెడీ.. దీపావళి తర్వాత ప్రారంభం కానున్న జియో ఫోన్ బుకింగ్స్
- తొలి దశ ఫోన్ల పంపిణీ దాదాపు పూర్తి
- దీపావళి తర్వాత రెండో విడతకు ముహూర్తం
- తొలి దశలో 60 లక్షల ఫోన్ల బుకింగ్
రిలయన్స్ జియో ప్రకటించిన 4జీ ఫీచర్ ఫోన్ తొలి దశ ఫోన్ల పంపిణీ దాదాపు పూర్తి కావస్తుండడంతో రెండో దశ ప్రీ బుకింగ్‌కు జియో సిద్ధమవుతోంది. దీపావళి తర్వాత బుకింగ్స్ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆగస్టు 24న తొలి దశ ఫోన్ బుకింగ్ ప్రారంభం కాగా, అనూహ్య స్పందన రావడంతో మూడు రోజులకే బుకింగ్స్ ఆపేసింది. అప్పటికే 60 లక్షల మంది ఫోన్లను బుక్ చేసుకున్నారు.
రెండుసార్లు వాయిదా పడిన అనంతరం నవరాత్రుల నుంచి ఫోన్ల పంపిణీ ప్రారంభించారు. తొలుత గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ చేశారు. ప్రస్తుతం పట్టణ, నగర ప్రాంతాల్లో ఫోన్లను పంపిణీ చేస్తున్నారు. జియో ఫోన్ల పంపిణీ దాదాపు పూర్తి కావడంతో రెండో దశ ప్రీ బుకింగ్‌కు సన్నాహాలు చేస్తున్నట్టు రియలన్స్ ప్రతినిధి ఒకరు తెలిపారు.
జియో ఫోన్‌ను వినియోగదారులకు ఉచితంగా అందిస్తున్న విషయం తెలిసిందే. సెక్యూరిటీ డిపాజిట్ కింద తొలుత రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది. దీనిని మూడేళ్ల తర్వాత తిరిగి ఇచ్చేస్తారు. అయితే ఈ చెల్లింపుల విషయంలో పలు నిబంధనలు ఉన్నట్టు ఇటీవల వార్తలు వెలువడ్డాయి. నిర్ణీత మొత్తంలో ప్రతీనెల రీచార్జ్ చేసుకున్న వారికే విడతల వారీగా సొమ్మును వెనక్కి ఇవ్వనున్నట్టు జియో తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. అయితే ఈ విషయంలో జియో నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు.