ttd: టీటీడీ సంచలన నిర్ణయం... తలనీలాల సమర్పణ సమయంలో డబ్బు గుంజుతున్న 243 మంది క్షురకులపై వేటు!
- 'మీ తృప్తి కొద్దీ...' అంటూ డబ్బు డిమాండ్
- నోటీసులిచ్చినా మారని వైఖరి
- తొలగిస్తున్నట్టు ప్రకటించిన అధికారులు
- తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ధర్నా
తిరుమలకు వెళ్లి, తలనీలాలను స్వామికి సమర్పించి, మొక్కు తీర్చుకునే వారిలో దాదాపు ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే అనుభవం ఏంటని అడిగితే, గుండు కొట్టించుకున్న తరువాత, క్షురకుడు 'మీ తృప్తి కొద్దీ...' అంటూ డబ్బు డిమాండ్ చేయడం. ఈ విషయంలో ఏళ్ల తరబడి భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. ఓ వైపు టీటీడీ నుంచి ఒక్కో గుండుకు కాంట్రాక్టు ప్రకారం డబ్బు తీసుకుంటూ, స్వామి దర్శనార్థం వచ్చే భక్తులను బాధిస్తున్న క్షురకులపై చర్యలు ప్రారంభమయ్యాయి.
గతంలో నోటీసులు అందుకుని కూడా పద్ధతి మార్చుకోని 243 మంది క్షురకులను విధుల నుంచి తప్పిస్తూ, అధికారులు సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. వీరంతా భక్తులను డిమాండ్ చేసి రూ. 10 నుంచి రూ. 50 వరకూ తీసుకున్నారని, సీసీటీవీ కెమెరాల్లో వీరు డబ్బు తీసుకోవడం రికార్డయిందని అధికారులు తెలిపారు. కాగా, ప్రపంచంలోని అతిపెద్ద కేశ ఖండనశాలగా పేరున్న తిరుమల కల్యాణకట్టలో 943 మంది క్షురకులు 24 గంటల పాటూ షిప్టుల వారీగా పనిచేస్తుంటారన్న సంగతి తెలిసిందే. కాగా, తొలగించిన క్షురకులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, నాయీ బ్రాహ్మణ సంఘం టీటీడీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించింది.