arun jaitley: జనం మెప్పు కోసం కాదు... దేశాభివృద్ధికి పని చేస్తున్నాం!: అరుణ్ జైట్లీ

  • ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యం
  • సరైన మార్గంలోనే నడుస్తున్నాం
  • వృద్ధి తగ్గినా తాత్కాలికమే
  • త్వరలో మరిన్ని వ్యవస్థీకృత మార్పులు

దేశ ప్రజల మెప్పుకోసం వారికి నచ్చే విధంగా విధాన నిర్ణయాలను తాము తీసుకోవడం లేదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ సమావేశాల నిమిత్తం అమెరికాలో పర్యటించిన ఆయన, ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఆర్థిక వ్యవస్థను సరైన దిశగా తీసుకు వెళ్లేందుకు సహకరించే అసలైన నిర్ణయాలనే తాము తీసుకుంటున్నామని, సరైన దారిలో నడుస్తున్నామనే భావిస్తున్నామని అన్నారు.

ఎన్నికల్లో ఓట్ల కన్నా, దేశాభివృద్ధే ముఖ్యమని గట్టిగా నమ్మే నరేంద్ర మోదీ వంటి నేత దేశానికి ఓ వరమని అన్నారు. తాత్కాలికంగా ఇబ్బందులు ఎదురవుతున్నట్టు కనిపించినా, జీఎస్టీ, నోట్ల రద్దు తదితర కారణాలతో లాభమే అధికంగా జరగనుందని అన్నారు. ప్రపంచమంతా రెండున్నర శాతం వృద్ధికి పరిమితమైన వేళ, ఇండియాలో గత మూడేళ్లుగా 7 నుంచి 8 శాతం వృద్ధిని సాధించిందని అన్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి సాధిస్తున్న దేశాల్లో ఇండియా ముందుందని అన్నారు.

ఆర్థిక వ్యవస్థలో వ్యవస్థీకృత మార్పులు చేస్తున్నామని అరుణ్ జైట్లీ వెల్లడించారు. ప్రపంచంలోని అగ్రదేశాలతో పోటీ పడేలా ఆర్థిక వ్యవస్థ బలపడాలంటే, ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలు అత్యంత కీలకమని తెలిపారు. 2020 తరువాత ఆర్థిక వృద్ధి రేటు రెండంకెల సంఖ్యకు చేరుతుందని తాను నమ్ముతున్నట్టు వెల్లడించారు.

బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ప్రజలకు మేలు కలిగించేలా నిర్ణయాలు ఉంటే, నగదు రహిత భారతావని సృష్టికి అవకాశం ఉండదని, ఈ సంగతి సిన్హాకు కూడా తెలుసునని అన్నారు. తదుపరి త్రైమాసికాల్లో తగ్గిన వృద్ధి రేటు తిరిగి పుంజుకుంటున్న సంకేతాలు వెలువడతాయని జైట్లీ తెలిపారు.

భారత ఆర్థిక భవిష్యత్తుకు ఢోకాలేదని, మరిన్ని విదేశీ పెట్టుబడులు రానున్నాయని అన్నారు. ముఖ్యంగా అమెరికా నుంచి వచ్చే పెట్టుబడులు పెరగనున్నాయని, నవంబరులో హైదరాబాద్ లో జరిగే ఇన్వెస్ట్ మెంట్ సదస్సుకు యూఎస్ నుంచి ఎంతో మంది పెట్టుబడిదారులు హాజరు కానున్నారని తెలిపారు.

  • Loading...

More Telugu News