Sushma: డోక్లాం విషయంలో భారత్ అనుసరించిన పద్ధతినే భర్తలపై ప్రయోగించండి: సుష్మా స్వరాజ్ సలహా
- మహిళ ప్రశ్నకు డోక్లాంతో ముడిపెట్టి సమాధానం ఇచ్చిన మంత్రి
- రాహుల్ నిక్కరు వ్యాఖ్యలపై మండిపాటు
- తప్పుడు భాష ఉపయోగించిన రాహుల్‌కు సమాధానం ఇవ్వబోనని వ్యాఖ్య
డోక్లాం విషయంలో చైనాతో భారత్ అనుసరించిన విధానాన్నే భర్తల విషయంలోనూ అనుసరించాలని విదేశాంగ శాఖామంత్రి సుష్మా స్వరాజ్ మహిళలకు పిలుపునిచ్చారు. బీజేపీ ఆధ్వర్యంలో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్వహించిన మహిళా సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ మహిళ మాట్లాడుతూ ఉద్యోగం చేయడానికి కుటుంబ సభ్యులు ఒప్పకోకపోతే ఏం చేయాలని మంత్రిని ప్రశ్నించారు.
ఆమెకు సమాధానంగా మంత్రి మాట్లాడుతూ.. ఉద్యోగం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను తొలుత వారికి వివరించాలని, అప్పటికీ వినకపోతే డోక్లాం విషయంలో చైనాపై భారత్ అనుసరించిన శాంతియుత విధానాన్ని అనుసరించి దారికి తెచ్చుకోవాలని నవ్వుతూ చెప్పారు. ఈ సందర్భంగా డోక్లాం విషయంలో భారత్-చైనా దేశాల మధ్య రెండు నెలలపాటు నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల గురించి వివరించారు. చివరికి శాంతియుతంగా సమస్య పరిష్కారమైందన్నారు.
మహిళలకు భద్రత, స్వేచ్ఛ, సాధికారత చాలా ముఖ్యమన్నారు. ఈ సందర్భంగా ‘ఆరెస్సెస్‌లో మహిళలు నిక్కర్లు ధరించడం చూశారా?’ అన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలపైనా స్పందించారు. ఆరెస్సెస్‌లోని మహిళలు నిక్కర్లు ఎందుకు ధరించరని రాహుల్ సూటిగా అడిగి ఉంటే సమాధానం చెప్పి ఉండేదానినని మంత్రి అన్నారు. ఆయన అలా ప్రశ్నించడం సరికాదని, తప్పుడు భాష ఉపయోగించిన ఆయనకు బదులిచ్చే ప్రసక్తే లేదని సుష్మ తేల్చిచెప్పారు.