journalist resignation: నింద భరించాల్సిన అవసరం లేదంటూ.. అర్ణాబ్ గోస్వామి ఛానెల్ కు రాజీనామా చేసిన జర్నలిస్టు!
- రిపబ్లిక్ టీవీ నుంచి బయటకు వచ్చిన సీనియర్ కరెస్పాండెంట్
- అర్ణాబ్ గోస్వామి నిఘా పెట్టడంతో నిర్ణయం
- శశిథరూర్ కి గూఢచారిగా వ్యవహరించిందన్న ఆరోపణ
- మీడియాలో హాట్ టాపిక్
కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ కి గూఢచారిగా పనిచేసిందన్న ఆరోపణల నేపథ్యంలో మనస్తాపం చెందిన జర్నలిస్టు రాజీనామా చేయడం వివాదాస్పదమైంది. 'టైమ్స్ నౌ' ఛానెల్ లో పని చేసి, అద్భుతమైన డిబేట్ యాంకర్ గా పేరుతెచ్చుకున్న అర్ణాబ్ గోస్వామి సొంతంగా నెలకొల్పిన 'రిపబ్లిక్ టీవీ'లో శ్వేతా కొఠారీ సీనియర్ కరస్పాండెంట్ గా పని చేస్తున్నారు. తాజాగా ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేసింది.
'శశిథరూర్ కు గూఢచర్యం చేశానన్న ఆరోపణలు వాస్తవం కాదు. ఆ మచ్చ భరించలేను. అందుకే రిపబ్లిక్ టీవీ ఛానెల్ ను వీడుతున్నాను' అంటూ ఆమె సుదీర్ఘమైన లేఖను ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేశారు. కాంగ్రెస్ నేత శశిథరూర్ కు తమ ఛానెల్ లోని సమాచారాన్ని శ్వేత అందించిందన్న అనుమానం ఎడిటర్ అర్ణాబ్ గోస్వామికి కలిగింది. దీంతో ఆమెపై నిఘాపెట్టాడు.
ఆమె కదలికల గురించి తనకు చేరవేయాలని సిబ్బందిని ఆదేశించాడట. అలాగే ఆమె ఆర్థిక పరిస్థితులపై కూడా ఆరాతీశాడని ఆమె వెల్లడించింది. ఇవన్నీ నిర్ధారించుకున్న తరువాతే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని ఆమె తెలిపారు. సోషల్ మీడియాలో శశిథరూర్ ను ఫాలో అవడంతో పాటు ఆయనకు చెందిన ఛేంజ్.ఓఆర్జీ పిటిషన్ పై తాను సంతకం చేయడంతో అర్ణాబ్ గోస్వామి తనపై అనుమానం పెంచుకున్నాడని శ్వేత అభిప్రాయపడ్డారు.
తానే కాదని, ఆ సంస్థలో చాలా మంది ఇలాంటి వేధింపులు ఎదుర్కొంటున్నారని ఆమె తెలిపింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై శశిథరూర్ స్పందిస్తూ, తనకు గూఢచారుల అవసరం లేదని, నిజాయతీపరులైన జర్నలిస్టులకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని తెలిపారు.