raghuveera reddy: చంద్రబాబు నిర్ణయాన్ని స్వాగతిస్తూనే.. పలు సూచనలతో బహిరంగలేఖ రాసిన రఘువీరారెడ్డి!
- గ్రామ కార్యదర్శుల నియామకాలు చేపట్టడాన్ని స్వాగతిస్తున్నాం
- ఔట్ సోర్సింగ్ ద్వారా నియామకాలు వద్దు
- ఏపీపీఎస్సీ ద్వారా నియామకాలు చేపట్టండి
- మరో జన్మభూమి కమిటీలా చేయకండి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మరో బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో 5,800 గ్రామ కార్యదర్శుల ఉద్యోగాలను భర్తీ చేయాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని... అయితే, వీటి నియామకాలు ఔట్ సోర్సింగ్ విధానంలో జరుగుతాయనే విషయం మాత్రం కలవరపెడుతోందని లేఖలో పేర్కొన్నారు. గ్రామ పాలనలో సెక్రటరీ సేవలు చాలా కీలకమైనవని, ప్రతి గ్రామంలో 36 రకాల రికార్డులు ఉంటాయని, వీటన్నింటిని ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. జననమరణాల దగ్గర నుంచి పంచాయతీకి వచ్చిన ఆదాయం, ఖర్చు, ఇంటి పన్నులు, ఇతర పన్నులు తదితర అంశాలను నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరాలన్నా... వీరిదే ప్రధాన భూమిక అని రఘువీరా అన్నారు. ఇంతటి కీలకమైన ఉద్యోగాలకు పర్మినెంట్ రిక్రూట్ మెంట్ లేకపోవడం మంచిది కాదని తెలిపారు. గ్రామ కార్యదర్శుల భర్తీ ఏపీపీఎస్సీ ద్వారానే జరగాలని, మెరిట్ ప్రకారం నియామకాలు చేపట్టాలని, రిజర్వేషన్లు పాటించాలని సూచించారు. ఔట్ సోర్సింగ్ ద్వారా నియామకాలు చేపట్టి, దీన్ని మరో జన్మభూమి కమిటీలా చేయవద్దని కోరారు.