foldable display: ఎల్జీ నుంచి స్మార్ట్ ఫోన్ టెక్నాలజీని తీసుకోనున్న యాపిల్!
- శాంసంగ్ బదులు ఎల్జీని ఆశ్రయించిన యాపిల్
- ఫోల్డబుల్ డిస్ ప్లే టెక్నాలజీ కోసం
- 2020 నుంచి ప్యానల్స్ తయారు చేయనున్న ఎల్జీ
అతి త్వరలో వినూత్న రీతిలో ఫోల్డబుల్ డిస్ ప్లేతో శాంసంగ్ 'గెలాక్సీ ఎక్స్'ను విడుదల చేయనుండటంతో, మార్కెట్లో వచ్చే పోటీని తట్టుకునేందుకు యాపిల్ సంస్థ కొత్త నిర్ణయం తీసుకుంది. ఫోల్డబుల్ డిస్ ప్లేలు తయారు చేస్తున్న మరో సంస్థ ఎల్జీ సహకారాన్ని తీసుకుని స్మార్ట్ ఫోన్ డిస్ ప్లేలను తయారు చేయాలని యాపిల్ భావిస్తోంది.
కొరియా వెబ్ సైట్ 'ది ఇన్వెస్టర్'లో వెల్లడించిన వివరాల ప్రకారం, ఇండస్ట్రీలో ఉత్తమ ఓఎల్ఈడీ డిస్ ప్లేలను అందిస్తున్న శాంసంగ్ ను కాదని, తమ ఫోన్లకు అధునాతన డిస్ ప్లేల కోసం యాపిల్ సంస్థ ఎల్జీని ఆశ్రయించింది. ఈ విషయంలో తొలుత శాంసంగ్ సహకారాన్ని తీసుకోవాలని భావించినా, ప్రధాన పోటీదారు కాబట్టి, ఫోన్ స్పెసిఫికేషన్స్ ముందే లీకవుతాయన్న ఉద్దేశంతోనే ఆ ఆలోచనను పక్కనబెట్టినట్టు తెలుస్తోంది.
కొత్త ఐఫోన్ మోడల్ కోసం వంపు తిరిగే ఓఎల్ఈడీ డిస్ ప్లే స్క్రీన్ లను ఎల్జీ తయారు చేసి యాపిల్ కు అందించనుందని 'ది బెల్' తన కథనంలో పేర్కొంది. కాగా, 2020 నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ ప్యానల్స్ ను ఎల్జీ తయారు చేస్తుందని సమాచారం.