ananta puram: అనంతపురం సమీపంలో కోతకు గురైన రైల్వే బ్రిడ్జి... ఎక్కడికక్కడ ఆగిన 44 రైళ్లు
- మరమ్మతులు చేస్తున్నామన్న అధికారులు
- కొన్ని రైళ్లు దారి మళ్లింపు
- నిన్న అనంతపురంలో భారీ వర్షం
గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనంతపురం జిల్లా కల్లూరు వద్ద రైల్వే బ్రిడ్జి కోతకు గురైంది. పట్టాల కింద నుంచి నీరు ప్రవహిస్తూ ఉండటంతో 44 రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రస్తుతం పట్టాలకు మరమ్మతులు చేస్తున్నామని, సాధ్యమైనంత త్వరగా సర్వీసులు పునరుద్ధరిస్తామని అధికారులు వెల్లడించారు. దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పలు రైళ్లను దారి మళ్లించినట్టు తెలిపారు. కొన్ని పాసింజర్ రైళ్లను రద్దు చేసినట్టు పేర్కొన్నారు. పెన్నానదిలో ప్రవాహం అధికంగా ఉండటం వల్లే బ్రిడ్జి కోతకు గురైందని అధికారులు వివరించారు.
కాగా, గత రాత్రి కూడా అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం నమోదైంది. పెన్నా, కుందు, బాహుదా తదితర చిన్న, పెద్ద నదులు పొంగి పొరలుతున్నాయి. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. నిన్న హైదరాబాద్ లో సైతం భారీ వర్షం పడింది. పలు కూడళ్లలోకి వర్షపు నీరు చేరగా, సుమారు గంటన్నర పాటు ట్రాఫిక్ స్తంభించింది. హైదరాబాద్ లో సగటును 4.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు.