anandi brahma: సినిమాల్లోకొచ్చి 7 కోట్లు పోగొట్టుకున్నాను: 'ఆనందోబ్రహ్మ' దర్శకుడు

  • యూకే, న్యూజిలాండ్ లో సంపాదించి సినీ రంగంలోకి వచ్చాను
  • 'విలేజ్ లో వినాయకుడు' మంచి పేరు తెచ్చినా, డబ్బులు మాత్రం ఇవ్వలేదు
  • ‘కుదిరితే కప్పు కాఫీ’, 'పాఠశాల' నష్టాలను మిగిల్చాయి
  • 'ఆనందో బ్రహ్మ'తో హిట్ కొట్టా

సినిమాల్లోకి వచ్చి సుమారు 7 కోట్ల రూపాయల వరకు నష్టపోయానని 'ఆనందో బ్రహ్మ' సినిమా దర్శకుడు మహీ వీ రాఘవ్ తెలిపారు. తన జీవితంలోని వివిధ దశల గురించి చెబుతూ, హార్స్ లీ హిల్స్ లోని బోర్డింగ్ స్కూల్ లో చదువుకున్నానని, అప్పట్లో సినిమాల గురించి అసలు తెలియదని అన్నారు. డిగ్రీలోకి వచ్చాక సినిమాలు చూసేవాడినని, ఎంబీఏలో ఉండగా సినిమాలపై ఇష్టం పెరిగిందని చెప్పారు.

కొన్నాళ్లకు స్నేహితులతో కలిసి నష్టాల్లో ఉన్న కంపెనీని కొనుగోలు చేసి రెండేళ్లు విజయవంతంగా నడిపానని అన్నారు. ఆ తరువాత దానిని అమ్మేసి, ఎంఎస్ చేసేందుకు యూకే వెళ్లానని, చదువు మధ్యలోనే ఆపేసి, ఉద్యోగంలో జాయిన్ అయ్యానని ఆయన తెలిపారు. ఆ తరువాత మూడేళ్లకు న్యూజిలాండ్ వెళ్లి కష్టపడి సంపాదించానని, ఆ తరువాతే తాను సినిమాల్లోకి వచ్చానని ఆయన చెప్పారు.

సాయికిరణ్‌ అడవి దర్శకత్వం వహించిన ‘వినాయకుడు’ సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేశానని చెప్పారు. మార్కెటింగ్‌ మీద పట్టు ఉండడంతో ఆ సినిమాకు తాను హెల్ప్ అయ్యానని ఆయన అన్నారు. అది ఆకట్టుకోవడంతో వెంటనే నిర్మాతగా మారి అదే బృందంతో ‘విలేజ్‌ లో వినాయకుడు’ సినిమా తీశానని ఆయన చెప్పారు. ఆ సినిమాకు కథను తానే సమకూర్చానని, సినిమాకు మంచి పేరొచ్చినా, డబ్బులు రాలేదని ఆయన చెప్పారు. ఆ తరువాత వరుణ్‌ సందేశ్‌ తో ‘కుదిరితే కప్పు కాఫీ’ సినిమాను నిర్మిస్తే అది కూడా నష్టాలే మిగిల్చిందని ఆయన వాపోయారు.

ఇక నిర్మాతగా ఉండడం వేస్ట్ అనే నిర్ణయానికొచ్చి, దర్శకుడిగా మారి కొత్త నటీనటుల్ని ప్రోత్సహించేలా ‘పాఠశాల’ సినిమా తీస్తే అది కూడా నిరాశపరిచిందని ఆయన చెప్పారు. ఇలా తాను సుమారు 7 కోట్ల రూపాయలు సినిమాల్లో నష్టపోయానని ఆయన తెలిపారు. దీంతో ప్రయోగాలు పక్కన పెట్టి కమర్షియల్ హంగులతో ‘ఆనందో బ్రహ్మ’ సినిమాను రూపొందించానని ఆయన చెప్పారు. ఈ సినిమా కథను నిర్మాత విజయ్‌ చిల్లా కంటే ముందు పది మందికి వినిపించానని, అయితే వారెవరూ ముందుకు రాలేదని ఆయన తెలిపారు. ఈ విజయం చాలా అపూర్వమైనదని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News