aarushi: నోయిడా జంట హత్యల మిస్ట‌రీ... ఆరుషి హంతకులు ఎవరు మరి?

  • త‌ల్లిదండ్రులను నిర్దోషులుగా ప్ర‌క‌టించిన కోర్టు
  • ఎన్నో మ‌లుపులు తిరిగిన కేసు
  • సుప్రీంకోర్టుకు సీబీఐ?

2008, మే 16న జ‌రిగిన ఆరుషి హ‌త్య కేసులో అల‌హాబాద్ హైకోర్టు సంచ‌ల‌న తీర్పునిచ్చింది. ఆరుషి త‌ల్లిదండ్రులు నూపుర్ త‌ల్వార్‌, రాజేశ్ త‌ల్వార్‌ల‌ను నిర్దోషులుగా కోర్టు ప్ర‌క‌టించింది. స‌రైన ఆధారాలు లేవ‌ని చెబుతూ వారిని నిర్దోషులుగా పేర్కొంది. దీంతో మ‌రి ఆరుషిని హ‌త్య చేసిందెవ‌రు? అనే ప్ర‌శ్న మిస్ట‌రీగానే మిగిలిపోయింది. దానితో పాటు `ఒక్క‌గానొక్క కూతుర్ని ఆ త‌ల్లిదండ్రులు ఎందుకు చంపుకుంటారు?` అనే ప్ర‌శ్న‌కు కూడా స‌మాధానం లేదు.

ఆ రోజు నోయిడాలోని త‌మ ఇంట్లో 14 ఏళ్ల ఆరుషిని బెడ్ రూంలో గొంతు కోసి హ‌త్య చేశారు. మొదట పనిమనిషి హేమరాజ్ కనిపించకుండా పోవడంతో అతన్ని అనుమానించారు. కానీ ఆ మ‌రుస‌టి రోజే ఇంటి పైక‌ప్పు మీద హేమరాజ్ శ‌వ‌మై క‌నిపించ‌డం సంచ‌ల‌నంగా మారింది. మొద‌ట ఈ కేసును నోయిడా పోలీసులు తీసుకున్నారు. ప‌నిమ‌నిషి హేమ‌రాజ్‌తో, ఆరుషి అభ్యంత‌ర‌కరంగా ఉండ‌టం చూసిన త‌ల్లిదండ్రులే వారిని హ‌త‌మార్చార‌ని వారు నిర్ధారణకు వచ్చారు. సంఘ‌ట‌నా స్థ‌లంలో మీడియా వాళ్లు సంచ‌రించ‌డం వ‌ల్ల కీల‌క ఆధారాలు చెరిగిపోయాయి.

స్థానిక పోలీసుల వ్యవహార శైలిపై పెద్ద ఎత్తున నిరసనలు రావడంతో త‌ర్వాత ఈ కేసును సీబీఐకి బ‌దిలీ చేశారు. వారి విచారణలో కూడా తల్వార్ దంపతులే హత్య చేసినట్టుగా తేల్చారు. ఆ ప్రకారం సీబీఐ న్యాయస్థానంలో అభియోగాలు మోపారు. ఈ హత్యలను బయటి వ్యక్తులు చేయలేదని, తల్వార్ దంపతులే చేశారని, చాలా పకడ్బందీగా సాక్ష్యాలను నాశనం చేశారని, హత్యలు జరిగినప్పటి పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని శిక్షలు విధించాలని సీబీఐ వాదించింది. వీరి వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం ఆరుషి త‌ల్లిదండ్రుల‌ను దోషులుగా ప‌రిగ‌ణిస్తూ 2013లో వారికి యావ‌జ్జీవ కారాగార‌ శిక్ష విధించింది.

దీంతో దీనిని సవాలు చేస్తూ ఆరుషి తల్లిదండ్రులు హైకోర్టుని ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ అనంతరం సరైన సాక్ష్యాధారాలు లేనందున వారిని నిర్దోషులుగా ప్రకటిస్తూ హైకోర్టు ఈ రోజు తీర్పునిచ్చింది. ఈ విష‌యంపై సుప్రీంకోర్టును ఆశ్ర‌యించే యోచ‌న‌లో సీబీఐ ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ హ‌త్య కేసు మీద `ఏక్ ఆరుషి థీ` అని సునీల్ మౌర్య అనే ర‌చ‌యిత పుస్త‌కం రాశారు. దాని ఆధారంగా `తల్వార్‌` అనే సినిమా తెర‌కెక్కింది. ఏదేమైనా హ‌త్యలు జ‌ర‌గ‌డం, రెండు ప్రాణాలు బ‌ల‌వ‌డం మాత్రం నిజం.. హంతకులు ఎవరన్నది మాత్రం మిస్టరీ!

  • Loading...

More Telugu News