baba ramdev: సుప్రీంకోర్టు ఆదేశాలను తీవ్రంగా వ్యతిరేకించిన రాందేవ్ బాబా
- హిందువులను, హిందూ పండుగలను టార్గెట్ చేయడం దారుణం
- చిన్న టపాసులకు అనుమతి ఇవ్వాల్సింది
- శశిథరూర్ వ్యాఖ్యలను కూడా తప్పుబట్టిన బాబా
దీపావళి సందర్భంగా ఢిల్లీలో టపాకాయలు కాల్చడంపై సుప్రీంకోర్టు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. సుప్రీం నిర్ణయంపై భిన్నమైన స్పందనలు వినిపిస్తున్నాయి. ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తప్పుబట్టారు. కేవలం హిందువులను, హిందువుల పండుగలను మాత్రమే టార్గెట్ చేయడం దారుణమని అన్నారు. ఎక్కువ ఆర్భాటం ఉండే టపాకాయలను తాను కూడా వ్యతిరేకిస్తానని... పెద్ద టపాసులపై నిషేధం ఉండాల్సిందేనని చెప్పారు.
చిన్న టపాసులకు అనుమతి ఇవ్వాలని అన్నారు. తాను కూడా స్కూళ్లను, యూనివర్శిటీలను నడిపిస్తున్నానని... అక్కడ చేత్తో పట్టుకుని కాల్చే బాణాసంచాలకు అనుమతి ఇచ్చామని చెప్పారు. టపాకాయల నిషేధాన్ని స్వాగతించిన కాంగ్రెస్ నేత శశిథరూర్ ను కూడా రాందేవ్ బాబా తప్పుబట్టారు. శశిథరూర్ లాంటి మేధావి కూడా ఇలా మాట్లాడితే ఎలాగని ప్రశ్నించారు. 'ఇండియా టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాందేవ్ బాబా ఈ మేరకు స్పందించారు.