chicken: చికెన్ అధికంగా లాగిస్తున్న వారిలో హైదరాబాదీయులే ఫస్ట్!
- తర్వాతి స్థానాల్లో బెంగళూరు, ఢిల్లీ
- అక్టోబర్ రెండో గురువారం వరల్డ్ చికెన్ డే
- స్విగ్గీ సర్వేలో వెల్లడి
హైదరాబాదీయులకు ముక్క లేనిదే ముద్ద దిగడం లేదని ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ నిర్వహించిన సర్వేలో తేలింది. ప్రతి ఏటా అక్టోబర్ రెండో గురువారాన్ని ప్రపంచ చికెన్ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా స్విగ్గీ ఓ ఆన్‌లైన్ సర్వే నిర్వహించింది. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలా అన్ని సమయాల్లోనూ హైదరాబాదీయులు చికెన్ లాగిస్తున్నారని ఈ సర్వేలో వెల్లడైంది. ఆ తర్వాతి స్థానాల్లో బెంగళూరు, ఢిల్లీ నగరాలు నిలిచాయి.
ఇక చికెన్ అధికంగా తినడానికి గల కారణాలను కూడా స్విగ్గీ సర్వే చేసింది. ఖర్చు తక్కువ, ఎక్కువ ప్రోటీన్లు, అద్భుతమైన రుచి వంటి కారణాలను వినియోగదారులు వెల్లడించారని స్విగ్గీ పేర్కొంది. ఆదివారం డిన్నర్ సమయాల్లోను, క్రికెట్ మ్యాచ్‌లు ఉన్న రోజుల్లోను చికెన్ వంటకాల ఆర్డర్లు ఎక్కువగా వస్తున్నట్లు స్విగ్గీ తెలిపింది. మిగతా రోజులతో పోల్చినపుడు ఈ రోజుల్లో 16-49 శాతం చికెన్ వంటకాల ఆర్డర్లు పెరుగుతున్నాయని చెప్పింది.
అలాగే చికెన్ ఆరోగ్యానికి మంచిదని భావించే వాళ్లు కోల్‌కతాలో 30 శాతం, న్యూఢిల్లీలో 19 శాతం, పూణేలో 18 శాతం మంది ఉన్నారని వివరించింది. ఎక్కువ మంది వినియోగదారులు చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రైడ్‌రైస్, తందూరీ చికెన్, చికెన్ 65, బటర్ చికెన్‌లను ఆర్డర్ చేస్తున్నట్లు పేర్కొంది. డిన్నర్ సమయంలో చిల్లీ చికెన్, చికెన్ టిక్కా, బ్రేక్‌ఫాస్ట్ సమయాల్లో చికెన్ శాండ్‌విచ్, చికెన్ బర్గర్, సాయంత్రం సమయంలో చికెన్ రోల్, చికెన్ షవర్మాలను ఆర్డర్ చేస్తున్నట్లు సర్వే తెలిపింది.