canada: ఒక్కరోజు దౌత్యవేత్తగా చండీగఢ్ విద్యార్థిని... లింగ సమానత్వం సాధించాలని ప్రసంగం
- ఆడపిల్లల చదువు ద్వారానే అది సాధ్యమన్న జస్లీన్ విర్క్
- అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా అవకాశం
- వినూత్న ప్రయోగం చేసిన కెనడియన్ కౌన్సల్ జనరల్
అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 11న చండీగఢ్‌లోని పీజీ ప్రభుత్వ కళాశాలకు చెందిన విద్యార్థిని ఒక్కరోజు దౌత్యవేత్తగా వ్యవహరించింది. బీఏ రెండో సంవత్సరం చదువుతున్న జస్లీన్ విర్క్ కెనడా దేశానికి కౌన్సల్ జనరల్‌గా వ్యవహరించింది. ఈ సందర్భంగా తన ప్రసంగంలో అన్ని రంగాల్లోనూ లింగ సమానత్వం సాధించాలని చెప్పింది. ఆడపిల్లలు చదువుకోవడం ద్వారానే అది సాధ్యమవుతుందని తెలియజేసింది. తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు కెనడియన్ కౌన్సల్ జనరల్ క్రిస్టఫర్ గిబ్బిన్స్ కృతజ్ఞతలు తెలిపింది.
అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని ప్రత్యేకంగా జరుపుకోవడానికి తాము ఈ ప్రయోగం చేశామని గిబ్బిన్స్ తెలిపారు. అందుకోసం పీజీ ప్రభుత్వ కళాశాల, ఎంసీఎం డీఏవీ మహిళా కళాశాల, గురు గోబింద్ మహిళా కళాశాలల నుంచి ఇద్దరేసి బాలికల చొప్పున ఎంపిక చేసి, వారిలో మంచి ప్రతిభ కనబరిచిన జస్లీన్‌కు ఒక్కరోజు దౌత్యవేత్తగా ఉండే అవకాశాన్ని ఇచ్చామని గిబ్బిన్స్ వివరించారు.