saudi arabia: ఎంపీగారూ, నన్ను రక్షించండి... ఈ నరకం నుంచి కాపాడండి!: కన్నీరుమున్నీరవుతున్న మహిళ... వీడియో చూడండి
- ఏదో రకంగా, ఎవరో ఒకరు నన్ను కాపాడండి
- సౌదీలో పంజాబీ మహిళ దారుణ పరిస్థితి
- సోషల్ మీడియాలో వైరల్ వీడియో
- కన్నీరు చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
అప్పులు, కన్నీళ్లు, కష్టాలను పోగొట్టుకునేందుకు కోటి కలలతో దేశం దాటి వెళ్లిన మహిళకు అక్కడ నరకం ఎదురైంది. సౌదీ ఆశలు అడియాసలవడంతో ఆ మహిళ తనను ఎవరో ఒకరు కాపాడాలని సోషల్ మీడియా వేదికగా కన్నీరుమున్నీరవుతోంది. ఆ వివరాల్లోకి వెళ్తే... పంజాబ్ లోని దవాడ్మీ సిటీకి చెందిన యువతి (22) గత ఏడాది సౌదీకి వెళ్లింది. అక్కడ ఓ వృద్ధురాలి బాగోగులు చూడాలనే ఒప్పందంపై ఆమెను సౌదీ తీసుకెళ్లారు.
ఇక అక్కడికి వెళ్లిన తరువాత కానీ ఆమెకు అర్థం కాలేదు.. తాను నరకంలో పడ్డానని! ఏడాదిగా ఆమె అక్కడ చిత్రహింసలు అనుభవిస్తోంది. ఈ నేపథ్యంలో తనను రక్షించాలని సంగూర్ నియోజకవర్గ 'ఆప్' ఎంపీ భగవంత్ మాన్ సహాయం కోరుతూ ఒక వీడియోను పోస్టు చేసింది.
ఆ వీడియోలో...‘భగవాన్ మాన్ జీ! దయచేసి నాకు సహాయం చేయండి. ఇక్కడ నేను నరకాన్ని అనుభవిస్తున్నా. ఏడాదిగా చిత్రహింసలు పడుతున్నా. గతంలో మీరు హోషియాపూర్ కు చెందిన ఒకామెను ఇలాంటి నరకం నుంచి రక్షించారు. నన్ను కూడా రక్షించండి. నేను మీ కూతురు లాంటి దాన్ని. దయచేసి నాకు సహాయం చేయండి. నన్ను మోసం చేసి ఇక్కడకు తెచ్చారు. ఇలాంటిది జరుగుతుందని నేను కలలో కూడా ఊహించలేదు. నన్ను రక్షించాలని, ఈ నరకం నుంచి కాపాడాలని ఇంటి నుంచి పారిపోయి దగ్గరలో ఉన్న సౌదీ పోలీస్ స్టేషన్ కు ఎన్నోసార్లు వెళ్లాను.
కానీ వాళ్లు నన్ను బయటకు గెంటేసి, మళ్లీ తెచ్చి ఇదే ఇంట్లో అప్పగించేవారు. దాంతో నరకం మరింత పెరిగేది. ప్రస్తుతం నన్ను గదిలో బంధించేశారు, అన్నం పెట్టడం లేదు, ఈ నరకం భరించడం నా వల్ల కావడం లేదు. చావకముందే నన్ను కాపాడండి. నాకు పెళ్లయింది, పిల్లలున్నారు. మా అమ్మకు బాగోలేదు. ఆమె వైద్యం, పిల్లల చదువు కోసమే నేను ఇక్కడికి వచ్చాను. నన్ను రక్షించండి... ఎవరో ఒకరు నాకు సాయం చేసి నన్ను కాపాడండి' అంటూ కన్నీరు మున్నీరవుతోంది. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు ఆమెను కాపాడాలని కోరుతున్నారు. ఆ వీడియోను మీరు కూడా చూడండి.