Plastic surgery: చిక్కులు తెచ్చిన ప్లాస్టిక్ సర్జరీ.. రూపం మారడంతో విమానాశ్రయంలో చైనా యువతుల నిర్బంధం!

  • పాస్‌పోర్ట్‌లోని ముఖాలతో సరిపోలని వైనం
  • అధికారుల నిర్బంధంలో యువతులు
  • పందుల ముఖాల్లా ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు
  • ప్లాస్టిక్ సర్జరీకి దక్షిణ కొరియా స్వర్గధామం

దక్షిణ కొరియా నుంచి చైనాకు పయనమైన ముగ్గురు యువతులకు విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. వారు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడంతో పాస్‌పోర్టులోని ముఖాలతో వారి ముఖాలు సరిపోలలేదు. దీంతో అధికారులు వారిని నిర్బంధించారు. ముఖాలకు బ్యాండేజీలతో చేతిలో పాస్‌పోర్టు పట్టుకున్న యువతుల ఫొటోలు ఇప్పుడు చైనాకు చెందిన సామాజిక మాధ్యమం వీబోలో వైరల్ అవుతున్నాయి. వీటిని దక్షిణ కొరియా విమానాశ్రయ అధికారులే తీశారని చెబుతున్నారు.

చైనాకు చెందిన ఈ ముగ్గురు మహిళలు ప్లాస్టిక్ సర్జరీ కోసం దక్షిణ కొరియాకు వెళ్లినట్టు తెలుస్తోంది. సర్జరీ అనంతరం తిరిగి స్వదేశం వెళ్తుండగా అడ్డుకున్న అధికారులు వారిని నిర్బంధించారు. పాస్‌పోర్టులోని ఫొటోలతో వారి ముఖాలు సరిపోలకపోవడంతో వారు ఎంత చెప్పినా అధికారులు వినిపించుకోలేదు. ఐడెంటిటీని నిరూపించుకోవాల్సిందేనని పట్టుబట్టారు.  

కాగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫొటోలను ఇప్పటి వరకు 51 వేల మందికిపై లైక్ చేయగా 23 వేల సార్లకు పైగా షేర్ అయింది.ఈ ఫొటోలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అందం కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటే ఇప్పుడు మీ తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని గుర్తించే అవకాశం లేకుండా పోయిందని ఒకరు కామెంట్ చేస్తే, ముఖాలు పంది తలలా పొంగిపోయాయని మరొకరు కామెంట్ చేశారు.

ప్లాస్టిక్ సర్జరీలకు దక్షిణ కొరియా పెట్టింది పేరు. ఇక్కడ ఖర్చు కూడా చాలా తక్కువ కావడంతో బ్యూటీ కోసం అందరూ ఈ దేశం బాట పడుతున్నారు. ఒక్క 2014లోనే ఏకంగా 9,80,000 మంది ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు. ఇక్కడ ప్రతి వెయ్యి మందిలో 20 మంది ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటుండగా, అమెరికాలో ఆ సంఖ్య పదమూడే. కాగా, ప్రస్తుతం దక్షిణ కొరియా అధికారుల నిర్బంధంలో ఉన్న యువతులను చైనాకు అనుమతించారా? లేదా? అన్న విషయం ఇప్పటి వరకు తెలియరాలేదు.

  • Loading...

More Telugu News