srisailam: 2 లక్షల క్యూసెక్కులకు చేరిన వరద నీరు... నేడు తెరచుకోనున్న శ్రీశైలం గేట్లు!
- అంతకంతకూ పెరుగుతున్న వరద
- 885 అడుగులకు చేరిన నీటిమట్టం
- ప్రస్తుత ఇన్ ఫ్లో 1.73 లక్షల క్యూసెక్కులు
- నేడు గేట్లను ఎత్తివేసే అవకాశం
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఆల్మట్టి, తుంగభద్ర జలాశయాల నుంచి వస్తున్న వరద నీటి మట్టం అంతకంతకూ పెరుగుతూ ఉండటంతో శ్రీశైలం జలాశయం పూర్తిగా నిండిపోయింది. నిన్న రాత్రి 8 గంటల సమయంలో జూరాల నుంచి 1,07,900 క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి 40,311 క్యూసెక్కులు, హంద్రీ నది నుంచి 25 వేల క్యూసెక్కులు కలిపి మొత్తం 1,73,211 క్యూసెక్కుల వరద ప్రవాహం ప్రాజెక్టులోకి వస్తుండగా, ఈ ఉదయం అది 2 లక్షల క్యూసెక్కులను దాటింది.
నీటి మట్టం 885 అడుగులకు చేరుకుంది. కర్నూలు జిల్లాలో పడ్డ భారీ వర్షాలకు తుంగభద్ర, హంద్రీ నదుల ద్వారా శ్రీశైలానికి వరద మరింతగా పెరుగుతుండగా, శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పత్తి ద్వారా 74,348 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ కు పంపుతున్నారు. దీంతో సాగర్ వద్ద నీటిమట్టం 522 అడుగులను దాటింది.
ఇక నేటి మధ్యాహ్నం ఎగువ నుంచి వరద పరిస్థితిని సమీక్షించి, శ్రీశైలం డ్యామ్ గేట్లను తెరవనున్నట్టు అధికారులు తెలిపారు. ఇదిలావుండగా, ఈ ఉదయం జూరాలకు వరద మరింతగా పెరిగినట్టు తెలుస్తోంది. దుందుభి నది పొంగి పొరలుతూ ఉండటంతో జూరాలకు మరో 87 వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. ఈ మొత్తాన్ని శ్రీశైలానికి వదులుతున్నారు.