Telugudesam: నేనే రెండు నిమిషాలు మాట్లాడి వచ్చేశాను... నీకెందుకంత సాన్నిహిత్యం?: కేసీఆర్ తో మంతనాలపై పయ్యావులకు చంద్రబాబు క్లాస్!
- సీనియర్లే ఇలా చేస్తే ఎలా?
- తెలంగాణలోనూ పార్టీ ఉంది
- వారి మనోభావాలకు విలువ లేదా?
- రాజీనామా చేస్తామంటున్నారు
- సమన్వయ కమిటీలో చంద్రబాబు ఆగ్రహం
వారం రోజుల క్రితం అనంతపురం జిల్లా వెంకటాపురం గ్రామంలో పరిటాల శ్రీరామ్ వివాహం జరిగిన వేళ, అక్కడికి వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో టీడీపీ సీనియర్ నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న పయ్యావుల కేశవ్ ఏకాంతంగా మాట్లాడటాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరుగగా, "తెలంగాణలోనూ తెలుగుదేశం పార్టీ ఉంది. అక్కడి వాళ్ల మనోభావాలను మనం గౌరవించాలి. నేను, కేసీఆర్ కూడా కలుసుకున్నాం. ఒకచోట ఎదురుగా వచ్చి, రెండు నిమిషాలు మాట్లాడుకున్నాం. ఆపై ఎవరిదారిన వాళ్లం వెళ్లిపోయాం. కానీ మన మంత్రులు, నేతలు పరిధులు దాటి ఆయనతో దగ్గరగా మెసిలారు" అంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు.
దీనిపై తెలంగాణ పార్టీ నేతలు తనవద్ద అభ్యంతరాలను వ్యక్తం చేశారని అంటూ, "పయ్యావుల సీనియర్. ఆయనకు కేసీఆర్ తో ఏకాంత సమావేశాలు ఎందుకు? ఏం సందర్భం ఉంది? పెద్ద నేతలు కూడా ఇలా చేస్తే ఎలా? తెలంగాణలో రాజీనామాలు చేసి వెళతామంటున్నారు" అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, శ్రీరామ్ వివాహ సమయంలో కేసీఆర్, పయ్యావుల దాదాపు పావు గంట సేపు దూరంగా నిలబడి మాట్లాడుకోవడం చర్చనీయాంశం కాగా, రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో చంద్రబాబు టీటీడీపీ నేతలతో సమావేశమైన వేళ, రేవంత్ తదితరులు ఈ విషయాన్ని ప్రస్తావించి ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.