Kashmir: బీహార్ విద్యాశాఖ మరో ‘ఘనత’.. కశ్మీర్ దేశ ప్రజలను ఏమని పిలుస్తారని ప్రశ్న!
- ఏడో తరగతి పరీక్షల్లో తప్పుడు ప్రశ్న
- విద్యార్థి గుర్తించడంతో వెలుగులోకి..
- గతంలోనూ పలుమార్లు వార్తల్లోకి ఎక్కిన విద్యాశాఖ
బీహార్ విద్యాశాఖ లీల మరోటి బయటపడింది. ఆ రాష్ట్ర విద్యాశాఖ నిపుణుల ప్రకారం కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం కాదు. అది వేరే దేశం. ఆ దేశ ప్రజలను ఏమని పిలుస్తారంటూ ప్రశ్నపత్రంలో ప్రశ్నించి మరోసారి వివాదానికి కేంద్ర బిందువు అయింది. ఏడో తరగతి విద్యార్థుల కోసం రాష్ట్ర విద్యాశాఖ తయారు చేసిన ప్రశ్న పత్రంలో ఈ ‘వండర్’ చోటుచేసుకుంది. ‘చైనా, నేపాల్, ఇంగ్లండ్, కశ్మీర్, ఇండియా ప్రజలను ------- అని పిలుస్తారు’.. అంటూ వేర్వేరు ప్రశ్నలు సంధించింది. అక్టోబరు 5న ప్రారంభమైన పరీక్షలు నేటి (బుధవారం)తో ముగియనున్నాయి.
‘సర్వ శిక్ష అభియాన్’లో భాగంగా బీహార్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కౌన్సిల్ (బీఈపీసీ) ఈ పరీక్షలు నిర్వహించింది. వైశాలి జిల్లాకు చెందిన ఓ విద్యార్థి మంగళవారం పశ్నపత్రంలోని తప్పును గుర్తించాడు. ఈ విషయమై జిల్లా విద్యాశాఖాధికారిని ప్రశ్నించగా తాను సెలవులో ఉన్నానని, దీని గురించి తెలుసుకుంటానని బదులిచ్చారు. బీఈపీసీ స్టేట్ ప్రోగ్రామ్ అధికారి ప్రేమ్ చంద్ర మాట్లాడుతూ పరీక్ష పత్రంలోని తప్పు గురించి తెలిసిందని, చాలా ఇబ్బందిగా అనిపించిందని పేర్కొన్నారు. అయితే అది ప్రింటింగ్ ఎర్రర్ అని ఆయన పేర్కొన్నారు. గతంలోనూ బీహార్ విద్యాశాఖ వార్తల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే.