spectacles: కళ్లద్దాలను కనిపెట్టే పని మరింత సులభం... బ్లూటూత్ ఆధారంగా పనిచేసే యాప్
- త్వరలో మార్కెట్లోకి విడుదల
- 35 మి.మీ. పొడవు, 10 మి.మీ. వెడల్పు ఉండే చిప్
- తీవ్ర చూపు లోపం ఉన్నవారికి ఉపయోగం
అత్యవసర సమయాల్లో కళ్లద్దాలు దొరకక, వాటి వెతుకులాటలో సమయం వృథా చేసుకునే వారు ఎంతోమంది ఉంటారు. వారిలాగే `లుక్` కంపెనీ సీఈఓ డాఫ్నా ఏరియలీ కూడా అలాంటి ఇబ్బందిని ఎదుర్కుంది. కానీ ఆమె ఊరికే ఉండలేదు. తన కళ్లద్దాలను త్వరగా వెతికేపెట్టే ఉపాయాన్ని ఆలోచించింది. ఆ ఆలోచనలో భాగంగా `లుక్` చిప్‌ను అభివృద్ధి చేసింది.
బ్లూటూత్ ద్వారా పనిచేసే ఈ చిప్‌ను కళ్లద్దాలకు అంటించాలి. తర్వాత చిప్‌ను యాక్టివేట్ చేసే ఓ ప్రత్యేక యాప్‌కు దాన్ని అనుసంధానం చేయాలి. అంతే... ఇక ఎప్పుడైనా కళ్లద్దాలు కనిపించకపోతే, యాప్ ఓపెన్ చేస్తే చాలు. కళ్లద్దాలు ఉన్న దగ్గర్నుంచి శబ్దం వస్తుంది. ఆ శబ్దాన్ని అనుసరిస్తే దొరికేస్తాయి.
త్వరలో మార్కెట్లోకి విడుదల కానున్న ఈ `లుక్` చిప్ తీవ్రంగా కంటి లోపం ఉన్న వారికి చాలా ఉపయోగపడుతుంది. 35 మి.మీ. పొడవు, 10 మి.మీ. వెడల్పు ఉన్న ఈ చిప్‌ను సులభంగా కళ్లద్దాలకు అంటించవచ్చు. అంతేకాదు ఈ చిప్‌ను ఐదు విభిన్న రంగుల్లోకి అందుబాటులోకి తీసుకురానున్నారు.