spyder: `స్పైడర్` సినిమా ఫ్లాప్ అన్నారో... చట్టపరమైన చర్యలు?
- నిర్ణయం తీసుకున్న చిత్ర నిర్మాణ బృందం
- ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతున్న పుకారు
- కలెక్షన్ల వివరాలను బహిర్గతం చేయడం చట్టరీత్యా నేరం
సినీ సమీక్షకుల వైఖరి ఈ మధ్య టాలీవుడ్‌లో వివాదంగా మారిన సంగతి తెలిసిందే. ఎలాంటి ప్రామాణిక జ్ఞానం లేకుండా కొందరు రివ్యూలు రాసి సినిమాను దెబ్బతీస్తున్నారని సినీతారలు, నిర్మాతలు విమర్శించడం చూస్తూనే ఉన్నాం. అలాంటి వారి మీద కేసులు కూడా పెడతామని హెచ్చరికలు కూడా జారీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫిల్మ్‌నగర్‌లో ఓ పుకారు చక్కర్లు కొడుతోంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్ బాబు నటించిన `స్పైడర్` సినిమాను ఎవరైనా ఫ్లాప్ అయిందని విమర్శలు చేస్తే, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చిత్రయూనిట్ నిర్ణయించుకుందట.
సినిమా విడుదలైన వారం రోజులకి వసూళ్లను లెక్కగడుతూ ఓ సమీక్షకుడు `స్పైడర్ సినిమా ఫ్లాప్` అని తన వెబ్‌సైట్‌లో పేర్కొన్నాడు. ఇప్పుడు ఆ సమీక్షకుడికి చిత్ర యూనిట్ నుంచి లీగల్ నోటీసులు అందినట్లు సమాచారం. బాక్సాఫీస్ కలెక్షన్లను బహిర్గతం చేయడం కాపీరైట్ చట్టం ప్రకారం నేరమని పేర్కొంటూ ఈ నోటీసులు పంపించారట. దీని వల్ల తమ సినిమాపై నెగెటివ్ రివ్యూలు రాసే వాళ్లపై సంబంధిత చిత్ర యూనిట్ చర్యలు తీసుకునే అవకాశం దొరికిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.