nobel: అమెరికన్ ఆర్థిక నిపుణుడు రిచర్డ్ హెచ్. థాలర్‌కి 2017 ఆర్థిక శాస్త్ర నోబెల్
- వెల్లడించిన రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్
- బిహేవియోరల్ ఎకనామిక్స్‌ను వివరించిన థాలర్
- షికాగో యూనివర్సిటీలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న థాలర్
ఆర్థిక శాస్త్రంలో 2017 నోబెల్ పురస్కారాన్ని అమెరికన్ ఆర్థిక నిపుణుడు రిచర్డ్ హెచ్. థాలర్‌కి అందజేయనున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది. బిహేవియోరల్ ఎకనామిక్స్ అధ్యయనంలో ఆయన చేసిన కృషికి గాను ఈ అవార్డు ప్రకటిస్తున్నట్లు తెలిపింది. 1945లో అమెరికాలోని న్యూజెర్సీలో జన్మించిన రిచర్డ్, షికాగో యూనివర్సిటీలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు.
వాస్తవానికి ఆర్థికశాస్త్రంలో నోబెల్ ఇవ్వాలని ఆల్ఫ్రెడ్ నోబెల్ తన వీలునామాలో పేర్కొనలేదు. అయితే, ఆయన జ్ఞాపకార్థం స్వీడన్ జాతీయ బ్యాంకు ఈ అవార్డును అందజేస్తుంది. దీన్ని స్వెరీష్ రిక్స్‌బ్యాంక్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్ సైన్సెస్ అని కూడా పిలుస్తారు. ఈ ఏడాది ఆర్థికశాస్త్రంలో నోబెల్ కోసం భారతీయ రిజర్వ్ బ్యాంకు గవర్నర్‌గా పనిచేసిన రఘురామ్ రాజన్ పేరును కూడా పరిశీలనలోకి తీసుకున్నట్లు కొన్ని వార్తలు వచ్చాయి.