tattoo: కనుగుడ్డు మీద టాటూ వేయించుకున్న ఢిల్లీ యువకుడు!
- దేశంలో మొదటి వ్యక్తి
- గొప్ప అనుభూతి అంటున్న కరణ్
- డేంజర్ అంటున్న వైద్యులు
ఢిల్లీకి చెందిన 28 ఏళ్ల కరణ్ టాటూ ఆర్టిస్ట్‌గా పనిచేస్తుంటాడు. ఇప్పటి వరకు తన ఒంటి మీద ఎన్నో టాటూలు వేయించుకున్నాడు. వాటి లెక్క ఎంతో అతనికే తెలియనన్ని వేయించుకున్నాడు. కానీ ఇటీవల తను వేయించుకున్న టాటూ అతని జీవితంలోనే గొప్పదని కరణ్ అంటున్నాడు. ఇంతకీ అతను టాటూ ఎక్కడ వేయించుకున్నాడో తెలుసా... కనుగుడ్డు మీద!
ఇంకో విషయం ఏంటంటే... ఇలా కనుగుడ్డు మీద టాటూ వేయించుకున్న మొదటి భారతీయుడు కూడా తనే. కనుగుడ్డు మీద టాటూ వేయడం చాలా క్లిష్టమైన పని. సూదుల ద్వారా గుడ్డు మీదకి రంగులను జాగ్రత్తగా పంపించాల్సి ఉంటుంది. పదమూడేళ్లప్పుడు తను మొదటి టాటూ వేయించుకున్నట్లు, 16 ఏళ్లప్పుడు టాటూ ఆర్టిస్టుగా వృత్తి మొదలు పెట్టినట్టు కరణ్ తెలియజేశాడు. ఇప్పటి వరకు తన ఒంటి మీద లెక్కలేనన్ని టాటూలు, 22 పీయర్సింగ్ (రింగు కుట్లు) ఉన్నట్లు అతను తెలిపాడు. అయితే ఇలా కనుగుడ్డు మీద టాటూలు వేయించుకోవడం వల్ల దీర్ఘకాలంలో చాలా ప్రమాదాలు ఎదుర్కునే అవకాశాలు ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు.