kangana ranaut: కంగనా వివాదంలో హృతిక్‌కి యామీ గౌతమ్ సపోర్ట్... సోషల్ మీడియాలో లేఖ రాసిన నటి
- మగాడిదే తప్పనడం సబబు కాదన్న యామీ
- లింగ సమానత్వం అంశం తప్పుదోవపడుతోందని వ్యాఖ్య
- వ్యక్తిగత విషయాన్ని సామాజిక వివాదంగా మార్చొద్దని మనవి
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, నటి కంగనా రనౌత్‌ల మధ్య ట్వీటోపట్వీట్ల వివాదం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఇరు వర్గాలు తమ వాదనకు మద్దతునిచ్చే సాక్ష్యాలను, స్టేట్‌మెంట్లను రోజుకొకటి చొప్పున బయటపెడుతున్నారు. క్రమంగా ఈ వ్యక్తిగత వివాదం కాస్తా నేటి సమాజంలో సమస్యగా మారిన లింగ సమానత్వ అంశంగా రూపాంతరం చెందుతోంది.
ఈ నేపథ్యంలోనే మరో బాలీవుడ్ నటి యామీ గౌతమ్ తన ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టింది. హృతిక్‌తో `కాబిల్` చిత్రంలో నటించిన యామీ గౌతమ్ చేసిన పోస్ట్ పరోక్షంగా ఆయనకు మద్దతునిస్తున్నట్లే కనిపిస్తోంది. చరిత్ర ఆధారంగా మగాడిదే తప్పనడం సబబు కాదని, ఇలా చేస్తే లింగ సమానత్వం కోసం చేస్తున్న పోరాటం తప్పుదోవ పడుతుందని, ఇద్దరు వ్యక్తుల మధ్య విషయాన్ని సామాజిక అంశంగా మార్చొద్దని ఆమె పోస్ట్‌లో పేర్కొంది.
`సాధారణంగా సోషల్ మీడియాలో నేను పెద్దగా మాట్లాడను. కానీ ఒక మహిళగా ఈరోజు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. బాలీవుడ్‌లో ఇద్దరు ప్రముఖుల వివాదం నన్ను స్పందించేలా చేస్తోంది. వారిలో ఒకరితో కలిసి నేను పనిచేశాను. అలాగని అతనికి మద్దతుగా నేను మాట్లాడటం లేదు. ఒక మహిళగా స్పందిస్తున్నాను.
నాకు చట్టాల గురించి పెద్దగా తెలియదు. ఈ వివాదం గురించి కూడా పెద్దగా తెలియదు. కేవలం మీడియాలో వచ్చిన విషయాలు మాత్రమే తెలుసు. వాటిని బట్టి చూస్తే ఆ ప్రముఖుల వివాదం లింగ సమానత్వ అంశంగా మారినట్టు అర్థమైంది. ఇప్పటికే సమాజం అతన్ని నేరస్థుడిగా ఖరారు చేసింది. తరాలుగా మహిళల మీద జరుగుతున్న వేధింపు ఘటనల ఆధారంగా సమాజం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సబబు కాదు. నిజానిజాల విచారణ పూర్తి కాకముందే ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? లింగ సమానత్వం అనే భావన నిజాలను కప్పేస్తోంది. దీని వల్ల లింగ భేదానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం తప్పుదోవ పట్టే అవకాశాలు ఉన్నాయి.
ఈ పోస్ట్ ద్వారా నేను ఎవరికీ మద్దతు పలకడం లేదు. ఎవరినీ కించపరచడం లేదు. ఇద్దరి వ్యక్తుల మధ్య గొడవను సామాజిక వివాదంగా మార్చొద్దని మాత్రమే వేడుకుంటున్నాను. ఈ విషయంలో నిజానిజాలు బయటికి వచ్చే వరకు మనమంతా సంయమనం పాటిద్దాం. ప్రతి చిన్న విషయాన్ని లింగ సమానత్వంతో ముడిపెట్టడం వల్ల నిజమైన లింగ భేద సమస్యలు మరుగునపడే ప్రమాదం ఉంది` అని యామీ పోస్ట్ చేసింది.