purandeshwari: ఎన్టీఆర్ మహనీయుడు... దయచేసి బజారుకు ఈడ్చవద్దు: సినీ పరిశ్రమకు పురందేశ్వరి విన్నపం
- ఎన్టీఆర్ జీవితం తెరచిన పుస్తకం
- ఆత్మగౌరవం అంటే అర్థం చెప్పిన మహానుభావుడు
- ఒక కోణం నుంచి చూసి సినిమాలు వద్దు
- దగ్గుబాటి పురందేశ్వరి
తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని నేల నలుచెరగులా చాటిన దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను సినిమాగా తీయాలని ఓ వైపు హీరో బాలకృష్ణ, మరోవైపు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మలు చేస్తున్న ప్రయత్నాలపై ఎన్టీఆర్ కుమార్తె, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి స్పందించారు.
"నందమూరి తారకరామారావు గారి జీవితం తెరిచిన పుస్తకం. ప్రతి పేజీ, ప్రతి అక్షరం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఓ సందర్భంలో రామ్ గోపాల్ వర్మే స్వయంగా చెప్పారు. ఆంధ్రులకు ఆత్మగౌరవం అంటే అర్థం చెప్పిన మహనీయుడు నందమూరి తారక రామారావని. ఆ మహనీయుడిని బజారుకు ఈడ్చవద్దని నేను అభ్యర్థిస్తున్నాను. ఏదైనా కూలంకుషంగా చూపించాలే తప్ప, ఒక యాంగిల్ నుంచి చూపించాలను కోవడం తప్పని నా అభిప్రాయం" అని అన్నారు.
రామ్ గోపాల్ వర్మను చిత్రం తీయవద్దని తాను చెప్పబోవడం లేదని, అయితే, అన్ని అంశాలనూ స్పృశించాలని కోరారు. ఆయన జీవితంలో జరిగిన ప్రతి ఒక్క సంఘటననూ తెరపై చూపించే సాహసం, ధైర్యం ఉంటే స్వాగతిస్తానని చెప్పారు. ఏదేమైనా ఆయన గౌరవాన్ని తిరిగి నిలబెట్టేలా సినిమా ఉండాలని, బజారులో పడేసేలా ఉండకూడదని, ఒక యాంగిల్ నుంచి సినిమాను తీస్తే న్యాయం చేసే అవకాశం ఉండదని సినీ పరిశ్రమకు సూచించారు.