dooms day: 'మరో వారంలో డూమ్స్ డే ముహూర్తం...' అంటున్న డేవ్ మీడ్.. కొట్టి పారేసిన నాసా!

  • ఈనెల 15 నుంచి భూమి అంతానికి నాంది
  • సర్వనాశనానికి ఏడేళ్ల సమయం పడుతుంది
  • అణు యుద్థాలు, ప్రకృతి విపత్తులు ముంచెత్తుతాయి
  • డూమ్స్ డే సిద్ధాంతకారుడు డేవ్ మీడ్
  • కొట్టి పారేసిన నాసా 

భూమి అంతమయ్యే రోజు ఇదేనని గతంలో చాలా తేదీలనే ప్రకటించారు. అవేవీ జరగలేదు. ఇప్పుడు తాజాగా డూమ్స్ డే సిద్ధాంతకారుడు డేవ్ మీడ్ మరో ప్రకటన చేస్తూ, భూమి నాశనమయ్యే కొత్త తేదీని నిర్ణయించారు. ఈ నెల 15, అంటే మరో వారం రోజుల్లో భూగ్రహ అంతానికి నాంది పడుతుందని అన్నారు. నిబిరు గ్రహం లేదా ప్లానెట్ ఎక్స్ భూమిని ఢీకొంటుందని, దీంతోపాటు ప్రకృతి విపత్తులు సంభవిస్తాయని ఆయన హెచ్చరించారు. 15 నుంచి వచ్చే ఏడేళ్లలో భూమి నామరూపాల్లేకుండా అంతమై పోతుందని డేవ్ మీడ్ చెప్పారు. ఈ ఏడేళ్లూ మానవాళి నరకయాతన అనుభవించాల్సిందేనని తేల్చి చెప్పారు. ప్రతి ఒక్కరూ మరణించే ముందు ఎంతో కష్టపడతారని చెప్పారు.

అమెరికా, కరేబియన్ దీవుల్లో వచ్చిన వరదలు, మెక్సికోలో సంభవించిన భూకంపం వంటివి భూమి నాశనానికి వచ్చినవేనని చెప్పారు. వీటన్నింటికీ తోడు అణు విపత్తులు వస్తాయని, యుద్ధం కారణంగా అణుబాంబులు పడి సర్వనాశనానికి నాందిగా మారుతుందని తెలిపారు. రష్యా, చైనా, ఇరాన్, నార్త్ కొరియా ఓ వైపు, అమెరికా, బ్రిటన్ మరోవైపు నిలిచి పోరాడతాయని అంచనా వేశారు

 కాగా, గత నెల 23న నిబిరు భూమిని తాకుతుందని డేవ్ మీడ్ చెప్పినా అది జరగలేదన్న సంగతి తెలిసిందే. గత నెలలో తాను చిన్న తప్పు చేసి అక్టోబర్ 23ను అంచనా వేశానని చెప్పిన డేవ్ మీడ్, ఈసారి తన మాటలు నిజమవుతాయని అంటున్నారు. తన వ్యాఖ్యలకు ఉదాహరణగా, ఆగస్టు 21న సంభవించిన సంపూర్ణ సూర్యగ్రహణం తరువాత, వరుస ఘటనలు ఎన్నో జరిగాయని డేవ్ మీడ్ గుర్తు చేశారు.

అయితే, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మాత్రం ఇదంతా నాన్సెన్స్ అంటూ కొట్టి పారేసింది.  

  • Loading...

More Telugu News