Chandrababu: కోట్లలో జనాన్ని ముంచేసిన మాయగాడు.. చంద్రబాబు, లోకేశ్ పేర్లతో మోసాలు.. చివరికి కటకటాల పాలు!
- కంపెనీల్లో పెట్టుబడుల పేరుతో మోసం
- అమరావతిలో నిర్మిస్తున్న ఆసుపత్రిలో లోకేశ్‌కు వాటాలున్నాయని ప్రచారం
- ఇంటి పేరును సైతం మార్చుకుని మోసాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్ పేర్లను యథేచ్ఛగా వాడుకుని ప్రజల నుంచి కోట్లాది రూపాయలు దండుకుంటున్న ఘరానా మోసగాడిని విజయవాడ మాచవరం పోలీసులు అరెస్ట్ చేశారు. తనకు బోలెడన్ని కంపెనీలు ఉన్నాయని, వాటిలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఇబ్బడి ముబ్బడిగా లాభాలు ఆర్జించవచ్చని జనాలను ముంచేసిన ఆ మోసగాడి పేరు నర్రా కృష్ణారావు. కృష్ణాజిల్లా నందిగామకు చెందిన కృష్ణారావు హైదరాబాద్‌లో వ్యాపారవేత్తగా స్థిరపడ్డాడు. భార్య ఇంద్రాణి, అతడి మరదలు శ్రీలతకు కూడా మోసాల్లో భాగం ఉండడంతో పోలీసులు వారినీ కటకటాల వెనక్కి పంపారు.
కృష్ణా జిల్లా కోలవెన్నులో హైదరాబాద్‌కు చెందిన ఎం.నారాయణ అనే పారిశ్రామికవేత్త మ్యాక్రో కాస్ట్ పేరుతో ఇనుమును కరిగించే పరిశ్రమను పెట్టి నష్టాల పాలయ్యారు. విషయం తెలిసి రంగంలోకి దిగిన కృష్ణారావు ప్రభుత్వంలోని పెద్దల వద్ద తనకు మంచి పరపతి ఉందని నమ్మించాడు. కంపెనీలో డైరెక్టర్ హోదా ఇస్తే ప్రభుత్వం నుంచి కోట్లాది రూపాయలు తీసుకొస్తానని నారాయణరావును నమ్మించాడు. దీనిని ఉపయోగించుకుని విజయవాడ, హైదరాబాద్‌లో పలువురికి కంపెనీల పదవుల ఆశ చూపి పెట్టుబడులు తెచ్చే ప్రయత్నం చేశాడు. కొందరిని ఉద్యోగంలో నియమిస్తున్నట్టు నకిలీ నియామకపత్రాలు కూడా ఇవ్వడంతో బాగోతం బయటపడింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి కృష్ణారావు, ఆయన భార్య ఇంద్రాణి, మరదలు శ్రీలలితలను అరెస్ట్ చేశారు.
కృష్ణారావుపై ఇప్పటికే పదుల సంఖ్యలో హైదరాబాదులో కేసులు నమోదై ఉండడం చూసి పోలీసులు అవాక్కయ్యారు. పాస్‌పోర్టు కోసం జన్మ ధ్రువీకరణ పత్రాల్లోనూ తప్పుడు సమాచారం ఇచ్చినట్టు గుర్తించారు. ఇక మంత్రి నారా లోకేశ్‌తో తనకు మంచి సంబంధాలున్నాయని చెప్పుకుని తిరిగాడు. హెరిటేజ్‌లో తనకు వాటాలున్నాయని చెప్పేవాడు. అమరావతి హెల్త్ సిటీ పేరుతో రాజధానిలో భారీ ఆసుపత్రి నిర్మిస్తున్నట్టు నమ్మబలికాడు. అందులో మంత్రి నారా లోకేశ్‌కు 25 శాతం వాటా ఉందని చెబుతూ పెట్టుబడుల పేరుతో డబ్బుల వసూళ్లకు పాల్పడ్డాడు. ఇందుకు తన ఇంటిపేరును సైతం వాడుకున్నాడు. ఇంటి పేరు నర్రా అయితే దానిని నారాగా మార్చేసుకున్నాడు. వీరి బంధువులు కూడా పలు మోసాలకు పాల్పడినట్టు కేసులు నమోదై ఉన్నట్టు పోలీసులు తెలిపారు.