online LLR: ఇక ఆన్ లైన్ లోనే ఎల్ఎల్ఆర్ పరీక్ష... ఆర్టీయే ఆఫీసుకు వచ్చే అవసరం లేదంటున్న ఏపీ ప్రభుత్వం
- అందివచ్చిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం
- లైసెన్స్ లు లేకుండా వాహనాలు నడుపుతున్న 30 శాతం మంది
- అందులో విద్యార్థులే అత్యధికులు
- ఒకేసారి 1000 మంది పరీక్షకు హాజరయ్యే అవకాశం
అందుబాటులోకి వస్తున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని, వృద్ధి బాటలో దూసుకెళుతున్న ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వాహనదారులు లెర్నింగ్ లైసెన్స్ కోసం ఆర్టీయే కార్యాలయాలకు వచ్చే అవసరం తప్పనుంది. ఇకపై ఆన్ లైన్ లోనే ఎల్ఎల్ఆర్ పరీక్షలు రాసే ఏర్పాట్లు చేస్తున్నట్టు రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. ఆన్ లైన్ పరీక్ష నిర్వహణకు అతి త్వరలోనే అన్ని అనుమతులూ రానున్నాయని, ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు దీనిపై అవగాహన కల్పిస్తున్నామని వెల్లడించారు.
ఎటువంటి లైసెన్స్ లూ లేకుండా 30 శాతం మంది వాహనాలు నడుపుతున్నారని, వారిలో విద్యార్థుల సంఖ్య అధికంగా ఉందని చెప్పిన తిరుపతి ఆర్టీవో వివేకానందరెడ్డి, ఒకేసారి ఆన్ లైన్ లో ఎల్ఎల్ఆర్ పరీక్ష నిర్వహించేందుకు ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాల, శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీలోని కంప్యూటర్ ల్యాబ్ లను పరిశీలించారు. ఆపై ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు ఆర్టీయే ఆఫీసుకు వచ్చి వెళ్లేందుకు తగిన సమయం లభించడం లేదని, అందువల్ల వారి సమస్యను దృష్టిలో ఉంచుకుని ఆన్ లైన్ లోనే లెర్నింగ్ లైసెన్స్ పరీక్షకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. అయితే, ఆన్ లైన్ పరీక్షకు కంప్యూటర్లు తామే సమకూరుస్తామని, ఒకేసారి పెద్ద సంఖ్యలో విద్యార్థులు, లైసెన్స్ కావాల్సిన వారు హాజరు కావచ్చని అన్నారు.