jedda: జెడ్డా సౌదీ రాయల్ ప్యాలెస్ పై ఉగ్ర దాడి
- ఇద్దరు గార్డులు మృతి
- మరో ముగ్గురికి గాయాలు
- ఏకే-47, గ్రనేడ్లతో వచ్చి దాడి
- ముందే హెచ్చరించిన అమెరికన్ ఎంబసీ
అత్యంత భద్రతను కలిగుండే జెడ్డాలోని సౌదీ రాయల్ ప్యాలెస్ పై ఉగ్రదాడి జరిగింది. అత్యాధునిక ఏకే 47 తుపాకితో, మూడు గ్రనేడ్లతో దాడికి దిగిన ఓ యువకుడు కాపలాగా ఉన్న ఇద్దరిని కాల్చి చంపాడని సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఘటనలో మరో ముగ్గురు గాయపడ్డారని, వారిని ఆసుపత్రికి తరలించామని ఓ అధికారి తెలిపారు. రాయల్ గార్డు ఔట్ పోస్టు వైపు హ్యుందాయ్ కారులో దూసుకు వచ్చిన ఆ వ్యక్తి, కాల్పులకు దిగాడని, భద్రతా దళాలు అప్రమత్తమయ్యేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని, ఉగ్రవాదిని మట్టుబెట్టామని వెల్లడించారు.
కాగా, ఈ దాడి జరగవచ్చని అమెరికా ఎంబసీ ముందే ఊహించడం గమనార్హం. సౌదీ రాయల్ ప్యాలెస్ పై ఉగ్రవాదులు దాడి చేయవచ్చని, అక్కడ ఉన్న యూఎస్ పౌరులంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ట్రావెల్ అడ్వయిజరీని విడుదల చేసింది. ఇటీవలి కాలంలో సౌదీ పోలీసులు, తమ దేశంలోని ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న అనుమానిత స్థావరాలపై దాడుల తీవ్రతను పెంచారు. గత వారం ఇద్దరు ఉగ్రవాదులను కాల్చి చంపి, మరో ఐదుగురిని అరెస్ట్ చేశారు. దానికి ప్రతీకారంగానే తాజా దాడి జరిగినట్టు అనుమానిస్తున్నారు.